KTR | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై.. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ బిడ్డల జీవితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వెలుగులు నింపారు. విదేశీ జైలు గోడల మధ్య మగ్గిపోతున్న అభాగ్యులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వారిని ఎలాగైనా సొంత గూటికి చేర్చాలన్న సంకల్పంతో తమ పార్టీ నేత భూక్య జాన్సన్‌నాయక్‌ను పురమాయించారు.
మలేషియా జైలు నుంచి విడుదలై స్వరాష్ర్టానికి చేరుకున్న బాధితులు బుధవారం నందినగర్‌లో కేటీఆర్‌ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. కంటి నుంచి రాలుతున్న నీటిచెమ్మను తుడుచుకుంటూ పుట్టిన గడ్డను, తమ పిల్లలను చూస్తామని కలలో కూడా అనుకోలేదని భావోద్వేగానికి లోనయ్యారు. కేటీఆర్‌కు, జాన్సన్‌నాయక్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్ గ్రా మాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఉపాధి కోసం నిరుడు మలేషియాకు వెళ్లారు. అక్కడ అరెస్టయి జైలు పాలయ్యారు. విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్చార్జి భూక్య జాన్సన్‌నాయక్‌తో మాట్లాడి బాధితులను విడుదల చేయించి స్వదేశానికి తీసుకురావాలని సూచించారు.
కేటీఆర్ సూచనతో జాన్సన్‌నాయక్ బాధిత కుటుంబాలను కలిసి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారి దీనస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ సూచనతో మార్చిలో మలేషియాకు వెళ్లి జైలులో ఉన్న లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాసర్, గురుజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్కు చెందిన యమునూరి రవీందర్‌ను కలిసి విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు.
అక్రమ ఆయుధ కేసులో అరెస్టయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్.. సొంత ఖర్చులతో స్థానిక న్యాయవాదులను నియమించి వారి విడుదల కోసం న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 12న మలేషియాకు మళ్లీ వెళ్లి అకడి కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించారు. విమాన టికెట్లతోసహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి తీసుకొచ్చారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న బాధితులు జాన్సన్‌నాయక్‌తో వెళ్లి నందినగర్‌లో కేటీఆర్‌ని కలిశారు. కేటీఆర్‌ను చూడగానే కన్నీటిపర్యంతమయ్యారు. కేటీఆర్, జాన్సన్‌నాయక్ చేసిన కృషికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
చైనా, ఇతర దేశాలు తమ వారిని దగ్గరుం డి వారం రోజుల్లోనే జైలు నుంచి విడిపించి తీసుకువెళ్లిపోయాయని బాధితులు కేటీఆర్‌తో తెలిపారు. వారిని ఓదార్చిన తర్వాత వారికి ఎదురైన కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తంచేసిన కేటీఆర్.. భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం బాధితులను విడిపించేందుకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని వాపోయారు. బాధితులను క్షేమంగా తీసుకొచ్చిన జాన్సన్‌నాయక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రశంసించారు.
రెండున్నరేండ్ల కింద మలేషియాకు పోయినం. విజిట్ వీసాతోనే మలేషియాలో చిక్కుకపోయినం. కంపెనీల్లో పనులు చేసుకున్నం. అక్కడ విరుద్ధంగా పనిచేస్తున్నామని పోలీసులు అరెస్టు చేసిండ్రు. మొత్తం 22మందిమి ఆరు నెలలు జైల్లో ఉన్నం. వారిలో తెలంగాణ వాళ్లం ఆరుగురం ఉన్నం. మేము పడుతున్న కష్టాలను మావాళ్లు జాన్సన్ నాయక్‌కు చెప్పిండ్రు. ఆయన వెంటనే స్పందించి రెండు నెలల కింద మలేషియాకు వచ్చి జైలులో మమ్మల్ని కలిసిండ్రు. ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ పూర్తి చేయించిండ్రు. బుధవారం కేటీఆర్ సార్‌ను కలిసినం. ఆయన మా బాగోగులు చూసుకుంటనని భరోసా ఇచ్చిండ్రు. మమ్మల్ని స్వదేశానికి రప్పించిన కేటీఆర్ సారుకు, జాన్సన్ నాయక్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
– గురిజల శంకర్, లింగాపూర్, కడెం మండలం, నిర్మల్ జిల్లా
సిరిసిల్ల రూరల్, మే 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేశ్ పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్య, పిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడారి దేశానికి వెళ్లగా, విధి వంచించింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డా.. అచేతన స్థితితో దవాఖానలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వెళ్లబోసుకున్నాడు.
‘రామన్న.. నన్ను ఆదుకోండి.. కాపాడు.. నా భార్యాపిల్లల చెంతకు తీసుకెళ్లు..ఈ నరకం భరించలేకపోతున్నా’ అంటూ విలపిస్తూ వేడుకోగా, కేటీఆర్ తక్షణమే స్పందించి.. నాలుగైదు రోజుల్లో తీసుకువస్తా అంటూ ఆపన్నహస్తం అందించారు. అనంతరం ఈనెల 11న మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మహేశ్ వివరాలు తెలుసుకుని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో గురువారం సౌదీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మహేశ్ చేరుకోనున్నాడు. మహేశ్‌కు భార్య పిల్లలు ఉన్నారు.