Inter Results | ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25వ విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ (TGTWREIS) విద్యార్థులు 84.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 6541 మంది విద్యార్థులు హాజరవ్వగా.. వారిలో 5536 మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా 7 రెసిడెన్షియల్ కాలేజీల్లో 100 శాతం ఫలితాలు సాధించారు.
బైపీసీలో దేవరకొండ గురుకులానికి చెందిన కె. అఖిల 996 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఎంపీసీలో పరిగి గురుకులానికి చెందిన కె.స్రవంతి 994 మార్కులతో గురుకులాల్లో టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ (TGTWREIS) కార్యదర్శి కె.సీతాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, సంస్థ వ్యూహాత్మక విద్యా ప్రణాళికలు ఫలించాయని పేర్కొన్నారు.