TGSRTC | హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
ఇందులో 557 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
తమ ప్రయా ణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.