TGSRTC |టీజీఎస్ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లకు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. సామాజిక బాధ్యతగా వినూత్న ఆలోచనతో ఇటీవల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్యతను వివరించడంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు.
వ్యక్తుల ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు యాత్రదానంలో భాగంగా తీసుకెళ్లేందుకు డిపోల వారిగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు వస్తుండటం అభినందనీయమన్నారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో శనివారం రాష్ట్రస్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. డిపోనకు ముగ్గురు చొప్పున విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లు హాజరైన ఈ సమావేశంలో.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి రీజియన్ల వారీగా వారి నుంచి సలహాలు, సూచనలను ఆయన స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ.. విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల పనితీరును మొచ్చుకున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 21 వేలకు పైగా అద్దెకు బస్సులను బుకింగ్ చేశారని, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉందని అభినందించారు. రాబోయే రోజులు సంస్థకు ఎంతో కీలకమని అన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్తో పాటు సంక్రాంతి పండుగకు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు.టీజీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, త్వరలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, తదితర టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల కృషి, పట్టుదల వల్ల సంస్థ ఉన్నతస్థాయిలో ఉందని అన్నారు.
నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తించడం వల్లే ప్రజల ఆదరాభిమానాలు సంస్థపై ఉంటున్నాయని సజ్జనర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దశల వారిగా పెండింగ్ అంశాలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి సమస్యను పై అధికారుల దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలని వీబీవోలకు సూచించారు.