TGSRTC | సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణిలను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు సహకరించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. మహాలక్ష్మీ పథకం అమలు కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సారి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు.
దసరా ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్ భవన్లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశమయ్యారు. దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ అధికారులకు వివరించారు. దసరా సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సజ్జనార్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లనూ నియమించామని తెలిపారు.
ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి 1602, ఎల్బీనగర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘర్ నుంచి 451 అదనపు బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 13, 14 వ తేదీల్లోనూ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బస్సుల కదలికలను గుర్తించేందుకు గమ్యం ట్రాకింగ్ యాప్‌ను వినియోగించుకోవాలన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు.