హైదరాబాద్, సెప్టెంబర్10 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ రూపొందించిన ‘యాత్రాదానం’ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రలకు అయ్యే ఖర్చును దాతలు స్పాన్సర్ చేసి మహోన్నత కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరా రు. సమాజ హితమైన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ముందుకురావాలని పేర్కొన్నారు. యాత్రాదానం కింద బస్సుల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ఆర్టీసీ హెల్ప్‌లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 ఫోన్‌చేసి సమాచారం ఇస్తే, సంబంధిత అధికారులు యాత్రాదానం టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారని ఆయన తెలిపారు.
ఆర్టీసీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో లాభాలు వచ్చినందున దసరా పండుగకు కార్మికులకు నెల జీతం క్యాష్ అవార్డు ఇవ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. బుధవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. 2024-25 వరకు 200 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని గుర్తుచేశారు.