హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ) : వాయుకాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు బీఎస్-6 బస్సుల వాడకానికి టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం చేట్టింది. బీఎస్-4 బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి బీఎస్-6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. వీటి వినియోగంపై డీఎంలు, డీవీఎంలు, ఆర్వీఎంలతో కూడిన 30 మంది సభ్యుల బృందం చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో సెప్టెంబర్లో అవగాహన కల్పించారు. తాజాగా మరో 30 మంది బృందం ఈ నెల 28, 29 తేదీల్లో చెన్నైలో జరిగే అవగాహన కార్యక్రమానికి హాజరుకానున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
దేశంలో 2000 నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్-I ప్రారంభమైంది. 2020 నుంచి బీఎస్ -6 ప్రమాణాలు మొదలయ్యాయి. బీఎస్-4 (బీఎస్-5 స్కిప్) డీజి ల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రాములుగా ఉండేది. దానిని బీఎస్ -6 బస్సుల్లో 80 మి.గ్రాలకు కట్టడి చేశారు. బీఎస్-6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే సూక్ష్మకణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో వాతావరణంలో కలిసే ప్రమాదం తగ్గిపోతుంది. ఈ బస్సుల్లో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. డాష్ బోర్డుపై 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. డాష్ బోర్డుపై ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.