TGSPDCL | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఒక ప్రాంతంలోని విద్యుత్ ఫీడర్పై అదనపు భారం పడితే అధికారులు వెంటనే అక్కడ కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తారు. సాధ్యమైనంత తొందరగా సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి ఫీడర్పై భారాన్ని తగ్గిస్తారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 చోట్ల ఫీడర్లపై అదనపు భారం పడుతున్నట్టు ఏడెనిమిది నెలల కిందటే అధికారులు గుర్తించారు. ఆ మేరకు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాస్తవానికి పాత పద్ధతిలోనైతే ఒకటి, రెండు సబ్స్టేషన్లను కలిపి టెండర్లు పిలవడం టీజీఎస్పీడీసీఎల్లో ఆనవాయితీ. కానీ, ఇక్కడే అధికారులకు చిక్కొచ్చిపడింది. ఓ అమాత్యుడి కంపెనీ కోసం పాత విధానానికి స్వస్తి పలికి.. కేవలం గ్రేటర్‌లోనే కాదు ఏకంగా దక్షిణ డిస్కం పరిధిలోని 240 సబ్స్టేషన్ల నిర్మాణాన్ని ఒకే పనిగా మార్చి గ్లోబల్ టెండర్లు పిలిచారు. తీరా.. మంత్రివర్యుల కంపెనీకి ఇదేదో గిట్టుబాటు కాని పనిగా తెలిసింది. ఇంకేముంది మొహం చాటేసింది. రెండుసార్లు టెండర్లు పిలిచినా బడా కంపెనీలు ఆ వంక కన్నెత్తి చూడలేదు. ఇలా ఆర్నెళ్ల పాటు పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. ఓవైపు వేసవి తరుముకొస్తున్నది. దీంతో ఇప్పటికిప్పుడు మళ్లీ పాత విధానంలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయినా ఈ వేసవి నాటికి ఒక్క సబ్‌స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చే దాఖలాలు కనిపించకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న వేసవిలో ఫీడర్లపై అదనపు భారం పడుతుండటం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న భయం వారిని వెంటాడుతున్నది.
గతంలో చిన్న చిన్న టెండర్లు పిలిచేవారు. దీంతో పాటు డిస్కం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన సామగ్రి (మెటీరియల్)ని సరఫరా చేసేది. ప్రభుత్వపరంగానే సామగ్రిని ఒకేసారి కొనుగోలు చేయడం వల్ల అంచనా వ్యయం కూడా తగ్గుతుంది. 240 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి నిరుడు ఆగస్టులో ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మంత్రి కంపెనీ రంగప్రవేశం చేసింది. ఆ కంపెనీ ఏపీలో పెద్దఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణానికి సామగ్రి తెప్పించుకున్నట్లు తెలిసింది. అక్కడ ఏం బెడిసికొట్టిందోగాని ఆ సామగ్రిని ఎలాగైనా వదిలించుకునేందుకు ఆయన కన్ను ఈ కొత్త సబ్స్టేషన్ల టెండర్లపై పడింది. మంత్రి కంపెనీ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు. పైగా మంత్రివర్యుల కంపెనీకి అనుకూలంగా ఉండేందుకు సామగ్రిని కాంట్రాక్టరే సమకూర్చుకోవాలనే నిబంధనను కూడా పొందుపరిచారు.
నిరుడు డిసెంబరులో గ్లోబల్ టెండర్లు పిలిచారు. చాలాచోట్ల స్థలాలతోపాటు ఇతరత్రా సమస్యలున్నట్లు తెలుసుకున్న కంపెనీ.. సామగ్రిని వదిలించుకునేందుకు కాంట్రాక్టు తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించింది. గిట్టుబాటుకాదనే తెలియడంతో చల్లగా జారుకున్నదని సమాచారం. ఇతర బడా కంపెనీలు కూడా ఈ సమాచారం తెలుసుకొని గ్లోబల్ టెండర్లకు దూరంగా ఉన్నాయి. దీంతో అధికారులు ఈ నెలలో రెండోసారి టెండరు పిలిచారు. అయినా అదే పరిస్థితి. వేసవి సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ కొత్త సబ్స్టేషన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు అనుకున్నారు. కానీ, మంత్రివర్యుల కంపెనీ రంగప్రవేశం.. వెనక్కి తగ్గడం వంటి పరిణామాలతో పుణ్యకాలం గడిచిపోయింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరుగుతున్నది. ఈ పరిణామాల దృష్ట్యా మార్చిలోనే వినియోగం భారీస్థాయికి పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటు చూస్తే కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్ల దశ కూడా పూర్తికాకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
గ్లోబల్ టెండర్ల ప్రక్రియ బెడిసికొట్టడంతో అధికారులు మళ్లీ పాత విధానం అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే ఆరేడు సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. ఇలా 240 సబ్స్టేషన్లు ఎప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తవ్వాలి? పనులు ఎప్పుడు మొదలుకావాలి? సబ్స్టేషన్లు ఎప్పుడు అందుబాటులోకి రావాలి? ఇప్పటికిప్పుడు పనులు మొదలుపెట్టినా ఎండాకాలంలోగా సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనందున అదనపు భారంతో ఫీడర్లు ఎంతమేరకు సహకరిస్తాయో తెలియక అధికారులు ఆందోళన పడుతున్నారు.