చిక్కడపల్లి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఇప్పటికే మాలో చాలామంది చనిపోయారు. అనారోగ్యాల బారిన పడి ఎందరో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మేము బతికుండగానే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే ఉన్నన్ని రోజులైనా జీవితాన్ని కొంత సంతో షంగా గడుపుతాం’ అని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొన్నారు. తమకు హక్కుగా రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్‌లోని బస్సుభవన్ ఎదుట గురువారం ఉపవాస దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వారంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస దీక్షలో పాల్గొన్నారు.
ఆర్పీఎస్ 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని కోరుతూ వారంతా నినదించారు. ‘మా కష్టార్జితం మాకు.. మా పిల్లల నోటికాడి బుక్క చెదరగొట్టొద్దు. ప్రభుత్వం మొండివైఖరి నశించాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులను కలువడానికి బస్సు భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. దీక్షకు అనుమతి లేదని అడ్డుకొన్నారు. దీంతో వాళ్లంతా బస్సుభవన్ అన్ని గేట్ల ఎదుట బైఠాయించి దీక్ష చేపట్టారు.
రిటైర్మెంట్ అయినవారికి ఆఖరి నెల జీతం కూడా అందలేదని, ఈ విషయంపై పలుమార్లు ఎండీని కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆర్టీసీ ఉద్యోగుల సారథ్య కమిటీ బాధ్యుడు పట్టాభి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఉపవాస దీక్షలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నదని విమర్శించారు. తమ బకాయిలు ఇవ్వడానికి సర్కార్‌కు చేతులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 60 ఏండ్లు పైబడిన తామంతా బీపీ, షుగర్‌తో బాధపడుతున్నామని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వకుండా చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తిరస్కరించిన పీఎఫ్ దరఖ్తాలను సరిచేయకుండా యాజమాన్యం చోద్యం చూస్తున్నదని పీవీ రంగారావు పేర్కొన్నారు. రిటైర్డ్ అయి అప్పులు తెచ్చి డీడీలు చెల్లించామని, అయినా పింఛన్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
2013, 2017కు సంబంధించిన వేతన సవరణ వివరాలను కూడా పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడంతో పెరుగాల్సిన పెన్షన్ కూడా ఆగిపోయిందని తెలిపారు. తమకు సంస్థ నుంచి రావాల్సిన డబ్బును తాము చూసుకోకుండా, తమ పిల్లలకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి మంచిది కాదని నజీరుద్దీన్ హితవు పలికారు. గ్రాట్యుటీ, సెటిల్మెంట్ సాలరీ, ఇతర ప్రయోజనాల బకాయిలను వెంటనే చెల్లించాలని కనకయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ సభ్యులు పీ చంద్రారెడ్డి, హమీద్, చెన్నయ్య, మనోహర్, జగదీశ్వరీదేవి, సునీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉపవాస దీక్షలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర అవస్థల పాలయ్యారు. చాలామంది ఎండకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న వాళ్లే అధికంగా ఉండటంతో సమీపంలోని చెట్లకింద కూర్చొని నిరసన తెలిపారు. భూపాలపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బీ శంకర్ ఎండకు తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, మాట్లాడలేకపోతున్నారని వైద్యులు తెలిపారు. శంకర్ భూపాలపల్లి డిపో ఏడీసీగా విధులు నిర్వర్తించి 2022లో రిటైర్డ్ అయ్యారు.