TGSRTC | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి, ఉసూరుమనిపించబోతున్నది. ఆర్టీసీలో రిటైర్మెంట్లకు తగ్గట్టుగా కొత్త నియామకాలు చేపడతామని ఇప్పటివరకు నిరుద్యోగులను మభ్యపెట్టిన రేవంత్రెడ్డి సర్కారు.. ఇప్పడు ఆ ఖాళీలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి 3 నెలల కాలపరిమితితో వందల మంది కండక్టర్లను నియమించుకోనున్నట్టు తెలిసింది. ఒక్క సికింద్రాబాద్ రీజియన్లోనే 300 మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లను తీసుకోనున్నట్టు వినికిడి. మిగిలిన అన్ని రీజియన్లలోనూ ఇలాగే ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనున్నట్టు సమాచారం. దీంతో ఆర్టీసీలోని ఖాళీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీలో అన్ని ఖాళీలను భర్తీచేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మొత్తంగా 3,038 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించింది. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి, గత 17 నెలలుగా తాత్సారం చేస్తున్నది. దీనిపై నిరుద్యోగులతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఏడాదిన్నరగా ఉత్త మాటలు చెప్పడమే తప్ప ఒక్క పనీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దొడ్డిదారిన ఔట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా కండక్టర్లను నియమించుకోవడం చట్టవిరుద్ధమని నిప్పులు చెరుగుతున్నారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియమించుకున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉండదని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.