TGPSC | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) దాదాపు ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ విరమణ పొందగా, ఈ నెలలో మరో సభ్యుడు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కమిషన్‌లో సభ్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉన్నాయి. చట్టం ప్రకారం కమిషన్ చైర్మన్‌తోపాటు 10 మంది సభ్యులను నియమించుకోవచ్చు. కానీ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కారు పాత కమిషన్ సభ్యుల చేత రాజీనామా చేయించింది. ఆ తర్వాత చైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యులను మాత్రమే నియమించింది. సభ్యులుగా నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేండ్లు లేదా 62 ఏండ్ల వయసు వరకు పదవిలో ఉండవచ్చు. కాంగ్రెస్ నియమించిన సభ్యుల్లో అనితారాజేంద్ర పదవీ విరమణ పొందారు. ఈ నెలలో మరో సభ్యుడు రామ్మోహన్రావు పదవీ విరమణ పొందనున్నారు. వచ్చే ఏడాది ప్రొఫెసర్ నర్రి యాదయ్య పదవీ విరమణ పొందుతారు. దీంతో అమీరుల్లాఖాన్, పాల్వాయి రజనీకుమారి మాత్రమే ఎక్కువకాలం పదవిలో ఉండనున్నారు.
బీఆర్ఎస్ హయంలో నియమించిన కమిషన్ చైర్మన్, సభ్యులతో కాంగ్రెస్ సర్కా రు రాజీనామాలు చేయించింది. దీనిని కాం గ్రెస్ పెద్దలు ప్రక్షాళన అని గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ‘ఉద్యోగాలు భర్తీచేసే కమిషనే ఖాళీ గా ఉంది.. వీళ్లేం ఉద్యోగాలు భర్తీ చేస్తారు’ అని ఆ పార్టీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను మాత్రమే నియమించింది. మరో ఐదుగురిని నియమించకుండానే వదిలేసింది. అధికారం లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం గమనార్హం. ప్రక్షాళన అంటే ఇదేనా? ముగ్గురు సభ్యులతో కమిషన్ నడపడమేనా? అంటూ నిరుద్యోగులు నిలదీస్తున్నారు.