హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నీళ్లు చల్లుతున్నది. ఉద్యోగార్హతకు వయో పరిమితిని తగ్గించి.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కొన్నేండ్లుగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారి కలలను భగ్నం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేండ్లలో కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో వయోపరిమితికి సడలింపు లభిస్తుందన్న ఆశతో ఎంతోమంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఓ నోటిఫికేషన్ వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్టు గ్రేడ్ కింద అసిస్టెంట్ సైంటిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ పరీక్షా విధానంలో 20 పోస్టులను భర్తీ చేయడానికి విద్యార్హతలు, వయోపరిమితిని ప్రకటించింది. ఆ నోటిఫికేషన్లో 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. వయోపరిమితి సడలింపును ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి చెందిన వారికి ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్మెన్కు మూడేండ్లు విధించింది. గతంలో ఇదే క్యాటగిరీకి చెందిన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 18 నుంచి 44 ఏండ్ల మధ్య వారికి అర్హత కల్పించిందని, ప్రస్తుతం దాన్ని పదేండ్లకు కుదించడం ద్వారా నష్టపోతామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
టీజీపీఎస్సీ తీరుతో తీవ్ర అన్యాయం
పదేండ్ల వయోపరిమితిని తగ్గించిన టీజీపీఎస్సీ కొన్నేండ్లుగా చదువుతున్న తమకు ఉద్యోగ అవకాశం రాకుండా అడ్డుకుంటున్నదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలిలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 44 ఏండ్ల వయోపరిమతిని విధించి, రిజర్వేషన్లలో మరో పదేండ్లు సడలింపునిచ్చి అందరికీ అవకాశం కల్పిస్తూ పోస్టులు భర్తీచేసిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు వయస్సు తగ్గించడంతో వేల మంది నిరుద్యోగులు నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పీసీబీలో ఇప్పటికే ఔట్సోర్సింగ్ విధానంలో అనలిస్టులుగా పనిచేస్తున్నవారికి అవకాశం రాకుండాపోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏండ్ల తరబడి పర్మినెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తమకు అన్యాయం చేయాలని చూస్తున్నదని ఆరోపిస్తున్నారు. పాత విధానంలోనే రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ టీజీపీఎస్సీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవిస్తామని తెలిపారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని, వయో పరిమితి తగ్గించి తమ జీవితాలతో చెలగాటమాడొద్దని వేడుకుంటున్నారు.