హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతోపాటు టీజీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ జెండర్ క్యాటగిరీకి రిజర్వేషన్లు కల్పించని రాష్ట్ర సబార్డినేట్ నిబంధనలను సవాలు చేస్తూ బీ ఏడుకొండలు అనే ట్రాన్స్‌జెండర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
టీజీపీఎస్సీ, కార్మికశాఖ నియామకాల్లో థర్డ్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లలో కుల రిజర్వేషన్లతో సంబంధంలేకుండా ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ కింద పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.