TGPSC | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి సూచించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ ఓ కమిటీని నియమించింది. పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన, సంస్కరణలపై చర్చించేందుకు టీజీపీఎస్సీ బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్చాన్స్లర్లు హాజరయ్యారు. ఇందులో గ్రూప్-1లో తిరిగి ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించినట్టు సమాచారం. పలువురు వీసీలు, నిపుణులు ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించినట్టు తెలిసింది.
దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో గ్రూప్-1లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని, మన రాష్ట్రంలో సైతం పునరుద్ధరించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇంటర్వ్యూ విధానంతో అన్యాయం, వివక్షకు దారితీస్తున్నదని, పారదర్శకంగా నియామకాలు జరగడంలేదని భావించిన గత కేసీఆర్ సర్కారు 2022లో గ్రూప్-1 సహా అన్ని నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దుచేసింది. రాతపరీక్షలో సాధించిన మార్కుల ద్వారానే నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో గ్రూప్-2, జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలుండేవి. గ్రూప్-1లో ఇంటర్వ్యూలను పునరుద్దరిస్తే, వీటికి కూడా పునరుద్ధరిస్తారా? అన్న చర్చలు నడుస్తున్నాయి.
పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులపై టీజీపీఎస్సీ దృష్టిసారించింది. ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో సుమారు 10-15% సిలబస్‌ను మార్చేందుకు సిద్ధమవుతున్నది. సిలబస్‌లో కొన్ని వర్తమాన అంశాలను చర్చే దిశగా కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014-15లో కమిటీ వేసి సిలబస్‌ను రూపొందించారు.
నాడు ఈ కమిటీలో ఉన్న ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, చుక్కా రామయ్య తదితరులు సమగ్ర అధ్యయనం చేసి, సిలబస్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అయితే పదేండ్లు పూర్తికావడంతో సిలబస్‌లో మార్పులు చేయాలని టీజీపీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 తోపాటు ఇతర పోటీ పరీక్షల సిలబస్‌లో స్వల్ప మార్పులను కమిటీ సిఫారసు చేయనున్నది. ప్రశ్నావళి, సాంకేతిక సంస్కరణలపై కూడా మరో రెండు కమిటీలు ఏర్పాటయ్యాయి.