హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల 10న గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజిల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం శుక్రవారం తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తికాగా, కోర్టుకేసుల చిక్కుముడులు సైతం వీడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 10న గ్రూప్ మార్కుల వివరాలను విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. 11న గ్రూప్-2, ఈ నెల 14న గ్రూప్ -3 ఫలితాలు విడుదల చేస్తారు.
గ్రూప్ -1 మార్కుల జాబితా విడుదల తర్వాత రీ కౌంటింగ్‌కు అవకాశం ఇస్తారు. 15 రోజులపాటు ఇలాంటి అవకాశముంటుంది. అయితే కమిషన్ నిబంధనల ప్రకారం రీ వాల్యుయేషన్‌కు అవకాశంలేదు. ఆ తర్వాత 1:1 పద్ధతిలో అభ్యర్థులను ఎంపికచేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. రీ కౌంటింగ్‌ను వచ్చిన దరఖాస్తులను బట్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.
గ్రూప్ -1 సహా పలు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాల విడుదల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పెండింగ్ నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించారు. అనంతరం జనరల్ ర్యాంకింగ్ లిస్టు, ప్రొవిజినల్ మార్కుల జాబితా షెడ్యూల్‌ను ఖరారుచేసి విడుదల చేస్తారు. ఇప్పటి వరకు గ్రూప్-2 తుది కీని విడుదల చేయలేదు. అయితే ఫలితాల విడుదల రోజే తుది కీని సైతం విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
గ్రూప్-1 సహా ఇతరాత్ర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బంది, అధికారులతో పరిచయాలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని సంప్రదిస్తే సమీపంలోని పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేయాలని సూచించారు. కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేయవచ్చని 9966700339 నంబర్, vigilance@tspsc.gov.in ఈ-మెయిల్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.