హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావావేసింది. వారంరోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని శనివారం నోటీసులు జారీచేసింది.
‘అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్లీమళ్లీ చేస్తా’ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. జైలులో బంధించిన క్రమంలో జైలు గోడలపై ‘నా రాజు తరతరాల బూజు’ అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి పుట్టిన ఓరుగల్లు నేలపై పుట్టిన బిడ్డను.. ఇలాంటి కేసులకు భయపడేదిలేదని శనివారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. తనపై పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో టీఎస్పీఎస్సీపై విమర్శలు చేసినా.. గత ప్రభుత్వం ఇలాంటి నోటీసులివ్వలేదనే విషయాన్ని గుర్తుచేశారు.
గ్రూప్-1 అభ్యర్థుల తరుఫున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా?.. ప్రజాప్రభుత్వం అంటూ క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆరోపణలు వస్తే వాస్తవాలు బయట పెట్టాల్సిందిపోయి.. నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడబోరని తేల్చిచెప్పారు.
గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డికి పరువు నష్టం దావా పేరుతో నోటీసులు జారీ చేయడం.. సర్కారు బెదిరింపు చర్యగా భావించాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్-1 జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన రాకేశ్‌రెడ్డిపై విచారణ పారదర్శకంగా కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు.