హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో మూడేండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీల కోసం వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాల ని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్(టీజీవో) అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేర కు గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ స్పౌజ్ కేసులు, అనారోగ్య కారణాలు, వితంతువుల అంశాలకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న బదిలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు వంశీ, వెంకట్యాదవ్, అభిరామ్, డ్రగ్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బాలకృష్ణ, ఆయుష్ ఫోరం అధ్యక్షుడు రవికుమార్, నర్సింగ్ ఫోరం అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.