కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 15 : బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం కరీంనగర్ జిల్లా నాయకులు డిమాండ్ చేశా రు. శనివారం వారు స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గొల్లకుర్మలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నినదిస్తూ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు సందెబోయిన ప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గొల్లకుర్మల సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. రెండో దఫా గొర్రెల పంపిణీ పథకం కోసం డీడీలు చెల్లించిన వారికి తమ ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తుందని ఎన్నికలకు ముందు ప్రకటించిన కాంగ్రెస్, గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డా రు.
గొర్రెలు, మేకల పెంపకం ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మటన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సత్వరమే స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు జంగ కొమురయ్య, నాయకులు గాదం శ్రీనివాస్, రాధారపు కుమార్ పాల్గొన్నారు.