TGMDC | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ) : ఇసుక క్వారీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకే తవ్వకాలు నిర్వహించాలన్న కేంద్ర మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిలువునా పాతరేసింది. ఇకపై రాత్రి 9 గంటల వరకు ఇసుక లోడింగ్ పనులను నిర్వహించాలని టీజీఎండీసీ శనివారం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక క్వారీలు పనిచేశాయి. కానీ, ఇటీవల ఇసుక రవాణాపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడం, తనిఖీల పేరుతో రవాణాను కట్టడి చేయడంతో హైదరాబాద్‌లో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. రవాణా, మైనింగ్ అధికారులు వేధిస్తుండడంతో టిప్పర్ల యజమానులు పక్షం రోజులుగా హైదరాబాద్‌కు ఇసుక రవాణాను నిలిపివేశారు. ఈ క్రమంలో టన్ను ఇసుక ధర ఏకంగా రూ.2,300కు పెరిగింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. సరసమైన ధరకు ఇసుక అందిం చకుండా, ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఇసుక లోడింగ్‌కు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇసుక లోడింగ్ సమయాన్ని పొడిగిస్తూ టీజీఎండీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.