హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : పరిశ్రమలకు అనుమతుల మంజూరీ, భూముల కేటాయింపునకు ఉద్దేశించిన టీజీఐఐసీ సంస్థ ఓ సీక్రెట్ ఏజెన్సీగా మారి, ఏ వివరాలూ బయటకు వెల్లడించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి దాదాపు 300 కంపెనీలకు అనుమతులు మంజూరు చేసినట్టు ఇటీవల మంత్రి ప్రకటించారు. అవి ఏ కంపెనీలు, వాటికి కేటాయించిన భూములెన్ని అని అధికారులను అడిగితే తెలియదనే సమాధానం వస్తున్నది. అసలు వివరాలు ఎం దుకు రహస్యంగా ఉంచుతున్నారనేది అంతుబట్టడం లేదు. ఓ వైపు సీఎంవో నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన కంపెనీలకే అనుమతులు, భూకేటాయింపులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా అధికారులు సైతం గోప్యత పాటించటంతో ఏదో మతలబు ఉందనే భావన కలుగుతున్నది. ఊరూపేరు లేని కంపెనీలకు అరకొర ధరలపై భూములు ధారాదత్తం చేస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ రాగానే తలకిందులు
వాస్తవానికి భారీ పెట్టుబడులు, రూ.100కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలు నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకుంటాయి. వాటి భూకేటాయింపు, రాయితీ తదితరాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని వివరాలు బయటకు వెల్లడిస్తారు. రూ.100కోట్లకు తక్కువ పెట్టుబడి ఉండే కంపెనీలు నేరుగా టీజీఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే టీజీఐఐసీ అధికారులు ప్రాజెక్టు వివరాల ఆధారంగా అనుమతులు, భూ కేటాయింపులు జరుపుతారు. అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండ దు. బీఆర్ఎస్ పాలనలో ఈ విధానం ఎంతో పారదర్శకంగా సాగగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆన్లైన్ విధానం అలంకారప్రాయం కాగా, భూముల కేటాయింపు రహస్యంగా మారిపోతున్నది. ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయిస్తున్నారో కనీసం టీజీఐఐసీలోని అధికారులకు కూడా తెలియడం లేదు. సచివాలయంలోని అధికారులు నేరుగా ప్రభుత్వానికి ఫైల్ పంపితే, అక్కడే అన్ని జరుగుతుండగా, కేవలం భూమి అలాట్‌మెంటు సందర్భంలోనే టీజీఐఐసీ అధికారులకు విషయం తెలుస్తున్న ది.
టీజీఐఐసీలో చైర్మన్ కార్యాలయం వద్ద తిష్ఠవేస్తున్న సంగారెడ్డి ప్రముఖ కాంగ్రెస్‌నేత అనుచరులు అధికారిక కార్యకలాపాలు స్తంభింపజేశారు. వారికి సీఎంవో నుంచి నేరుగా సంబంధాలు ఉండటంతో టీజీఐఐసీలో వారు చెప్పిం దే వేదంగా మారింది. దీంతో పరిశ్రమల అనుమతులు, భూకేటాయింపులు కోరుతూ వచ్చే ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనను అధికారులు నిలిపివేశారు. దరఖాస్తులు పరిశీలించినా కాం గ్రెస్ నేత ఏజెంట్ల గ్రీన్‌సిగ్నల్ లేకుండా అనుమతులిచ్చే వీలులేకపోవడంతో ఎందుకొచ్చిన తంటా అనుకొని మిన్నకుంటున్నారు. దీంతో టీజీఐఐసీలో ఆన్లైన్ దరఖాస్తులు కుప్పలుగా పేరుకుపోయాయి. డిసెంబర్ చివరినాటికే రెండున్నర వేలకుపైగా దరఖాస్తులు పరిశీలనకు నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. సహజంగా టీజీఐఐసీకి వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రాజెక్ట్ రిపోర్టులు, వారికున్న అర్హతల ఆధారంగా వారం-వారం ఇంటర్వ్యూలు నిర్వహించి అనుమతులతోపాటు భూముల కేటాయిస్తారు. కాగా, రెండేండ్లలో కేవలం 12సార్లే భూముల కేటాయింపు ఇంటర్వ్యూలు, అందునా అధికారపార్టీ నేత అనుచరుల నుంచి క్లియరెన్స్ వచ్చిన కంపెనీలను మాత్రమే పిలిచి అనుమతులు, భూకేటాయింపులు జరిపినట్టు ఆరోపణలున్నాయి.
కేటాయింపులు వెల్లడించని సర్కార్
గతంలో ఫార్మాసిటీని ఏర్పాటుచేసిన ప్రాంతంలో ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కార్, అక్కడ యంగ్‌ఇండియా స్కిల్ యూనివర్సిటీ తోపాటు ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, స్పోర్ట్స్ హబ్, హెల్త్‌సిటీ, గ్రీన్ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ తదితర కాలుష్యంలేని కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నది. ఇప్పటివరకు 300 కంపెనీలకు అనుమతులు మంజూ రు చేసినట్టు పేర్కొంటుండగా, ఏ కంపెనీకి ఎంత భూమి కేటాయించారో, ఇచ్చిన రాయితీలు ఏమిటో అనే వివరాలు వెల్లడించడం లేదు.
బీఆర్ఎస్ సర్కార్ సైతం వేలాది కంపెనీలకు భూములు కేటాయిస్తూ పారిశ్రామికరంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు భూకేటాయింపు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటో అర్థంకావడంలేదు. వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉండదు, అధికారుల ను అడిగితే మౌనం వహిస్తున్నారు. కంపెనీల స్థాపన కోసం భూములు కేటాయించాలని కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తులొస్తుంటే, వాటిని పరిశీలించకుండా నేరుగా సీఎంవో ఆదేశాల ప్రకారమే భూములు కేటాయిస్తున్నట్టు పరిశ్రమల వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
గుట్టు తెలుస్తుందనేనా?
ఏ కంపెనీకి ఎంత భూమి ఇవ్వాలో, ఎంత ధర నిర్ణయించాలో, ఎంత మేరకు రాయితీలు ఇవ్వాలో అనే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కంపెనీల స్థాయి ఆధారంగా అవసరమైతే ప్రభుత్వం ఉచితంగా భూములు కేటాయించవచ్చు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వానికి భారీగా ఆదా యం వచ్చే కంపెనీలు, లేకుంటే సదరు కంపెనీ ద్వారా అనేక యాన్సిలర్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కలిగి ఇకోసిస్టం డెవలప్ అవుతుందనే కంపెనీల విషయంలో ప్రభుత్వం ఎంతమేరకైనా రాయితీలు అందించే వీలుంటుంది. ఇక్కడే అసలు మతలబు దాగి ఉన్నదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్హతలు లేని, ఊరూ-పేరు లేని కంపెనీలకు ప్రభుత్వం అరకొర ధరలకు భూములు ధారాదత్తం చేసేందుకే వివరాలు వెల్లడించడంలేదని అభిప్రాయాలు న్నాయి. ఒక్కో కంపెనీకి ఒక్కోలా భూముల ధరలు నిర్ధారించడం, రాయితీల విషయంలోనూ కంపెనీకీ కంపెనీకి మధ్య తేడాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం వివరాలను గోప్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.