హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గుజరాత్ నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్లో ఈ నెల 1 నుంచి 10 వరకు రెండు బృందాలు రెక్కీ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ సోమవారం ప్రకటించారు.
నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు ఓ బ్యాంకు ఉద్యోగి సహా మొత్తం 14 మంది మ్యూల్ ఖాతాదారులు, ఆరుగురు ఏజెంట్లు ఉన్నారని, వారి నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్‌బుక్స్, 2 పాన్‌కార్డులు, 2 రబ్బర్ స్టాంపులు, పలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
తెలంగాణలోని 60 కేసుల్లో, దేశవ్యాప్తంగా 515 కేసుల్లో ప్రమేయం ఉన్న ఈ నిందితులు.. 27 మ్యూల్ ఖాతాలతో రూ.4.37 కోట్లు మళ్లించారని, చెక్కుల ద్వారా ఒక్క తెలంగాణలోనే రూ.22,64,500 విత్‌డ్రా చేశారని వివరించారు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలను అపరిచితులకు తెలియజేయవద్దని, ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌ను లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని శిఖాగోయెల్ సూచించారు.