హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని, ఆ తర్వాతే కరీంనగర్ ఎమ్మెల్యే ఎన్నికకు సం బంధించిన ఎలక్షన్ పిటిషన్ విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ చిల్లకూరు సుమల త మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన బండి సంజయ్.. ఆ వ్యవహారంలో సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాకుండా పదేపదే వాయిదాలు కోరడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. వాయిదాలపై వాయిదాలు కోరడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఒకసారి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. మరోసారి పార్టీ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నదని పేర్కొంటూ అడ్వకేట్ కమిషన్ ఎదుట సాక్ష్యం ఇవ్వని సంజయ్.. ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నానని చెప్తూ మళ్లీ వాయిదా కోరడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రెండు వాయిదాలకు అనుమతి
కరీంనగర్ ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికను సవాలు చేస్తూ బండి సంజయ్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు గత జూలైలో జిల్లా మాజీ జడ్జి కే శైలజ నేతృత్వంలో అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ ఎదుట హాజరై సాక్ష్యం ఇవ్వాలని బండి సంజయ్‌ని ఆదేశించింది. అనంతరం ఆయన కమిషన్ ఎదుట హాజరు కాకుండా రెండుసార్లు వాయిదా కోరడంతో కోర్టు అనుమతించింది. మంగళవారం పిటిషన్ విచారణకు రావడంతో.. బండి సంజ య్ అమెరికా పర్యటనలో ఉన్నారని, ఈ నెల 12న తిరిగి వస్తారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు మరోసారి వాయిదా ఇవ్వాలని కోరడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకాకుండా వాయిదా కోరడం ఇది మూడోసారని, కోర్టు సమయాన్ని వృథా చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఎలక్షన్ పిటిషన్లను 6 నెలల్లోగా పరిషరించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని, సత్వర విచారణకు బండి సంజయ్ సహకరించకపోగా వాయిదాపై వాయిదాలు కోరడం సబబుకాదని పేర్కొన్నది. సంజయ్ ఇదే వైఖరిని కొనసాగిస్తే ఆయన పిటిషన్‌పై విచారణ ముగిసినట్టు ప్రకటించాల్సివస్తుందని హెచ్చరించింది. అనంతరం ఆయన తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఈ నెల 12న బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరవుతారని, అందుకు అనుమతించాలని కోరారు. దీంతో ఈసారి బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పిన హైకోర్టు.. తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది.