TG Weather | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మార్చిలోనే ఎండలు దంచికొడుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాగల నాలుగురోజుల్లో తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని.. రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. ఆ తర్వాత మళ్లీ పెరిగేందుకు అవకాశం ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
శుక్రవారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడుతాయని.. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతాయని పేర్కొంది. మరికొన్ని ఉరుములు, మెరుపులతో పాటు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.