హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే నత్తనడకన కొనసాగుతున్నది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నా.. ఇంకా సగం ఇండ్ల సర్వే కూడా పూర్తికాలేదు. మరోవైపు అరకొరగానే వివరాలు నమోదు చేయాల్సి వస్తున్నదని ఎన్యూమరేటర్లే పెదవి విరుస్తున్నారు. కుటుంబ వివరాలు తప్ప చాలా మంది ఆస్తులు, ఆదాయ సమాచారమే ఇవ్వడం లేదని తేల్చి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల)ను ఈ నెల 6న మొదలు పెట్టింది. ఈ నెల 26 కల్లా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు గణాంకాల సేకరణకు 87,807 మంది ఎన్యూమరేటర్లను, 8,788 అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది. మొత్తంగా 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ బ్లాకులుగా విభజించింది. తొలుత 3 రోజులపాటు సర్వే చేపట్టాల్సిన ఇండ్ల గుర్తింపు ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేపట్టారు. మొత్తంగా 1,16,14,349 ఇండ్లను మారింగ్ చేసినట్టు వెల్లడిస్తున్నారు. ఈ ఇండ్ల గుర్తింపు ప్రక్రియ కూడా చాలాచోట్ల సవ్యంగా సాగలేదని ఆరోపణలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో గృహ యజమానులైతే ఇండ్ల గుర్తింపునకు నిరాకరించారు. ఎన్యూమరేటర్లు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా లక్షలాది ఇండ్లను గుర్తించనే లేదని లేదని తెలుస్తున్నది.
రెండో దశలో భాగంగా 9 నుంచి గుర్తించిన ఇండ్ల వివరాల నమోదును ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ సగటున 150 ఇండ్లను కేటాయించారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకూ 15 ఇండ్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన కొనసాగుతున్నదని తెలుస్తున్నది. ప్రధాన, ఉప ప్రశ్నలతో కలిపి మొత్తంగా 75 ప్రశ్నలకు పైగా సమాచారాన్ని సేకరించి ఫారాన్ని నింపాల్సి ఉన్నది. ఒక్కో ఫారాన్ని నింపడానికి సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతున్నదని తెలుస్తున్నది. మధ్యాహ్నం భోజనం అనంతరం సర్వేను ప్రారంభించినా సాయంత్రానికి కల్లా కనీసం 10 ఇండ్ల సమాచారాన్ని కూడా సేకరించలేక పోతున్నారు. ఈ నెల 26 కల్లా సర్వే పూర్తిచేయాలన్న గడువు ఉన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల ఇండ్ల సర్వే పూర్తికావాల్సి ఉండగా, 51,24,542 ఇండ్ల లో అంటే 44.1 శాతం మాత్రమే సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనిని బట్టే సర్వేలో జరుగుతున్న జాప్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నిర్దేశిత గడువులో ఇండ్ల సర్వేను పూర్తిచేయడం కష్టమేనని ఎన్యూమరేటర్లే తేల్చి చెప్తున్నారు. గడువు పెంచాలని ఇప్పటికే సూపర్వైజర్లకు, ఉన్నతాధికారులను పలువురు ఎన్యూమరేటర్లు కోరారు.
సర్వే పూర్తయితే, వాటి డేటా ఎంట్రీని కూడా డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో వివరాల నమోదు సవాల్‌గా మారి, సర్వే ప్రక్రియ మరింత జాప్యమయ్యే పరిస్థితులు కనిపిస్తుండగా, ఆన్లైన్లో ఎంట్రీ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికిపైగా డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించింది. వారికి ఇప్పటివరకు శిక్షణను పూర్తి చేయలేదు. తప్పులు దొర్లకుండా డేటా ఎంట్రీ చేపట్టాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీ కూడా మరిన్ని రోజులు పట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులో సర్వేను పూర్తి చేయడం కష్టమేనని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటింటి సర్వే ఏమోగానీ పిల్లల చదువులు ఆగమవుతున్నాయని ఇటు తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్వే కోసం మధ్యాహ్నం వేళ పాఠశాలలకు సెలవు ప్రకటించడం వల్ల విద్యార్థుల చదువులు సరిగా సాగడం లేదని వారంటున్నారు. పిల్లలపై పర్యవేక్షణ కూడా కరువైందని తెలుపుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం వేళ ఇటు ఇండ్లలోనూ ఎవరూ అందుబాటులో ఉండటం లేదని, దీంతో సమాచార సేకరణ కష్టతరంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సెలవుల్లో సర్వే చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించకుండా, ప్రభుత్వం అనాలోచితంగా సర్వే చేపట్టిందని విద్యార్థులు తల్లిదండ్రలు మండిపడుతున్నారు.