హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సోలార్ప్లాంట్ల ఏర్పాటులో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలన్న నిర్ణయం తీసుకున్న సర్కారు వెయ్యి మెగావాట్లను మాత్రమే మహిళా సంఘాలకు కేటాయించింది. పీఎం కుసుమ్ స్కీంలో కాంపోనెంట్-ఏలో భాగంగా నాలుగు వేల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఇటీవలే ఇంధనశాఖ అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు వేల మోగావాట్లల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను స్వశక్తి సంఘాలకు అప్పగించారు. ఇలా వెయ్యి గ్రూపులకు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశముంది. మిగతా మూడు వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను రైతులకు అప్పగిస్తారు. ఇందుకు టీజీ రెడ్కో టెండర్లు ఆహ్వానించింది. ఆసక్తి గల వారు డిసెంబర్ 10లోపు టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండర్ దక్కించుకున్న సంస్థ ప్లాంట్ల డిజైన్, సామగ్రి సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, ఏడాదిపాటు నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందని టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ వావిల్ల అనిల తెలిపారు.