TG Rains | రాబోయే ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.5 కిలోమీటర్ల తక్కువ ఎత్తులో కొనసాగుతుందని, ద్రోణి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పింది.
ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్‌తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, తో పాటు జగిత్యాల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.
హైదరాబాద్ జంట నగరాలతో పాటు యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, నారాయణపేట, సిద్దిపేటలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. భోనగిరిలో 13, నందనంలో 12, వనపర్తి జిల్లా కనాయిపల్లిలో 11.7, శ్రీరాంగాపూర్లో 13, జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో 13.3, చిన్న తాండ్రపాడులో 12, వెంకటాపూర్‌లో 12.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.