Telagana | మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్స్‌ల జారీ చేయనున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించింది. గౌడ్స్‌కు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. ఆరు స్లాబుల ద్వారా లైసెన్స్‌ల జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి స్లాబులుంటాయని చెప్పింది.
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లెసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్నది. డిసెంబర్ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్స్‌దారులను లాటరీ ద్వారా ఎక్సైజ్‌శాఖ ఎంపిక చేయనున్నది. రాష్ట్రంలో 2600కుపైగా మద్యం దుకాణాలున్నాయి. అయితే, గతంలో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత నోటిఫికేషన్ సమయంలో తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి రూ.1350కోట్లు.. దరఖాస్తుల లైసెన్స్ ఫీజు కింద రూ.3500కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఈ సారి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని సర్కారు భావిస్తున్నది.