TG Inter Results | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ప్రతి పని ప్రహసనంగా మారుతున్నది. ఏ పని చేసినా హంగు ఆర్భాటాలతో చేపడుతూ మంత్రులు అభాసు పాలవుతున్నారు. చిన్న పనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రచారం కల్పించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇంటర్ పరీక్షల ఫలితాలను ముగ్గురు మంత్రులు కలిసి విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యాశాఖ మంత్రి ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అందుబాటులో లేని పక్షంలో.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా సంబంధింత ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఫలితాలను ప్రకటించడం ఆనవాయితీ.
అయితే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండటంతో ఇదే సందని కోతికి కొబ్బరి కాయ దొరికింది అన్న చందంగా కాంగ్రెస్ మంత్రులు తమ ప్రచార యావకు తెరతీశారు. డిప్యూటీ సీఎం, మరో ఇద్దరు మంత్రులు కలిసి ఫలితాలను విడుదల చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం ఇంత హంగామా అవసరమా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననేమో డిప్యూటీ సీఎం ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అది కూడా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అని చెప్పారు. కానీ డిప్యూటీ సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు రావడం.. ఫలితాలను అర గంట ఆలస్యంగా విడుదల చేయడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేసింది. దీంతో గుర్తింపు కోసం ఆ పార్టీలోని నాయకులు ఎంత తపన పడుతున్నారోనని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయని ప్రజలు, మీడియా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇంటర్ పాసైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్లో కూడా విద్యార్థులంతా వారి ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యుతన్నత స్థానాకలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి.. వారు నా ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా చెప్పారు. విద్యార్థులందరికీ సీఎం రేవంత్ తరపున అభినందనలు.. వారి భవిష్యత్ కోసం విద్యాశాఖ నిరంతరం పని చేస్తుందని సీఎం స్పష్టంగా తెలియజేయాలని కోరారు. విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించిన అధ్యాపకులకు, పారదర్శకంగా ఫలితాలు ప్రకటించిన బోర్డుకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాని తెలుపుతూ భట్టి తన ప్రసంగాన్ని ముగించారు.