Telangana | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో క్రిమినల్ గ్యాంగ్‌లు దోపిడీలకు పాల్పడేందుకు తిష్ఠవేశాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి’ అంటూ డీజీపీ జితేందర్ ఈ నెల 7న హెచ్చరించారు. అర్ధవార్షిక క్రైమ్ రివ్యూలో తెలంగాణలో దారుణంగా పెరిగిపోతున్న దోపిడీలు, దొంగతనాలు, డ్రగ్స్ కేసులపై ఆయన ఆందోళన సైతం వ్యక్తంచేశారు. డీజీపీ హెచ్చరించిన వారంలోనే హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారీ దోపిడీలు చోటుచేసుకోవడం గమనార్హం. క్రిమినల్ గ్యాంగ్‌ల నేరాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా.. మన పోలీసులు పెడచెవిన పెట్టడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంత దారుణస్థితికి దిగజారాయో ఈ ఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి.
నిరుడు విడుదల చేసిన ప్రభుత్వ లెక్కల ప్రకారమే తీవ్రమైన నేరాలు 22.53 శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు, బంధిపోటు దారిదోపిడీలు, రాత్రివేళ ఇండ్లలో చోరీలు రోజుకు కనీసం 80 వరకు నమోదవుతున్నట్టు పోలీసుల లెక్కలే చెప్తున్నాయి. రాష్ట్రంలో రోజూ 9 రేప్ కేసులు నమోదవుతుండగా, 3హత్యలు, రోజులో 5 కిడ్నాప్‌లు చోటుచేసుకుంటున్నాయంటే లా అండ్ ఆర్డర్ ఎంతలా గాడితప్పిందో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ ఏడాది దొంగతనాల సంఖ్య 10వేలకు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. నడిరోడ్లపై కత్తులతో వీరంగం, అందరూ చూస్తుండగానే నరకడం, తుపాకులతో కాల్పులు, దోపిడీలు, దొమ్మీలు, డబ్బుల కోసం చేసే హత్యలు రాష్ట్రంలో దారుణంగా పెరిగిపోతున్నాయి.