Sircilla Collector | ప్రోటోకాల్ విషయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బుధవారం ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకున్నది. జెండా ఆవిష్కరణ సమయానికి హాజరుకాకపోవడంతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలుకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం వహించారు. దాంతో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని సీఎంవోతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఈ విషయంలో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సర్కారు నోటీసులు ఇచ్చింది. అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. గురువారం జిల్లావ్యాప్తంగా విప్ ఆదికి మద్దతుగా బీసీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌కు సీఎస్ నోటీసులు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 3గంటల్లోగా వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరుస వివాదాలతో చిక్కుల్లోపడ్డారు. కోర్టు ధిక్కరణ విషయంలో తెలంగాణ హైకోర్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఓ భూ నిర్వాసితుడి విషయంలో కోర్టు బుధవారం వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. మిడ్ మానేరు ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోయిన చీర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల ఎల్లయ్య అనే నిర్వాసితుడికి పరిహారం చెల్లించలేదని.. కోర్టు ఆదేశాలను పాటించలేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద కలెక్టర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే, బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమానికి కలెక్టర్ ఝా ఆలస్యంగా వచ్చారు. కలెక్టర్ వచ్చే సమయానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలికేందుకు రాకపోవడంతో పాటు జెండా ఆవిష్కరణ సమయం వరకు అక్కడ లేకపోవడం వివాదానికి కారణమైంది.