హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో-317 బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొత్తగా మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ బదిలీలకు అవకాశం ఇచ్చింది. శనివారం మూడు వేర్వేరు జీవోలను ప్రభుత్వం జారీచేసింది. జీవో-317పై సమీక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పలు సిఫారసులు చేసింది. వీటి ఆధారంగా మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పరస్పర బదిలీల్లో భాగంగా ఇంటర్ లోకల్ క్యాడర్లో అవకాశం కల్పించారు. మెడికల్ బదిలీలు కోరుకునే వారు 70శాతం వైకల్యం కలిగి ఉన్నవారై ఉండాలి. మానసిక వికలాంగులైన పిల్లలున్నవారు సైతం అర్హులే. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31లోపు సంబంధితశాఖలు జీఏడీకి సమాచారాన్నిచ్చి బదిలీ చేయవచ్చు. స్పౌజ్ బదిలీల విషయంలో ఖాళీలను బట్టి బదిలీలకు అవకాశం ఇచ్చింది.
జీవో-317 నిబంధనలకు అనుగుణంగా మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించడంపై టీఎస్ యూటీఎఫ్ అసంతప్తి వ్యక్తంచేసింది. బాధితులకు న్యాయం చేయడం విషయంలో సర్కారు తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని అభిప్రాయపడింది. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నెలలపాటు శోధించి గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించడం మినహా ఏం చేయలేకపోయిందని రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి అభిప్రాయపడ్డారు. పది నెలలుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు జీవోలను చూసి నిరాశ నిస్పృహలకు లోనయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో-317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.