హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట్టు రుజువులు చూపాలని మెలిక పెట్టింది. అది కూడా 2024 జూన్ 2వ తేదీలోపు గల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు చూపాలని ఉత్తర్వుల్లో పేరొన్నది. ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఎకడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. తెల్ల కాగితాలపై సాదా బైనా మా దరఖాస్తులు స్వీకరించిన సర్కారు మళ్లీ తీసుకొనిరావాలని చెప్పడమేంటని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా దరఖాస్తుల సంఖ్యను తగ్గించి రైతులకు అన్యాయం చేసేందుకేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూక్రయ, విక్రయాల్లో తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల (సాదాబైనామాలు)ను పరిశీలించి అర్హులైన వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్టు పేర్కొన్నది. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు సదరు రైతు 12 ఏండ్లకుపైగా ఆ భూమి తన స్వాధీనంలో ఉన్నట్టుగా రుజువులు చూపించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. సాదాబైనామాలపై ఉన్న స్టే ఆర్డర్‌ను గత నెల హైకోర్టు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాదాబైనామాల దరఖాస్తులను క్లియర్ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.
వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో రైతుల మధ్య నెలకొన్న భూ తగాదాలను పరిష్కరించేందుకు వీలుగా 2016లోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 2014 జూన్‌కు ముందు జరిగిన ఒప్పందాలను క్రమబద్ధ్దీకరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులైన 6.18 లక్షల మంది రైతులకు క్రమబద్ధ్దీకరణ పట్టాలను అందజేసింది. ఇక 2020లో కూడా బీఆర్ఎస్ సర్కారు మరోసారి అవకాశం కల్పించింది. ఆ ఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 8.9 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అయితే దీనిపై కోర్టులో కేసులు దాఖలు కావడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు స్టే ఆర్డర్‌ను ఎత్తేయడంతో అప్పటి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కారు పరిశీలించి.. అర్హులైన రైతులకు క్రమబద్ధీకరణ చేయనున్నది. 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 8.9 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.