హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ భేటీ వాయిదా పడింది. గురువారం జరుగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని 23వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద క్యాబినెట్ భేటీ కానున్నట్టు తెలిసింది. వాస్తవానికి గురువారం సచివాలయంలోనే సమావేశం ఉంటుందని సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అదేరోజు కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఇదే కార్యక్రమంలో ఇతర మంత్రులు కూడా కొందరు కుటుంబ సమేతంగా వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ భేటీని వాయిదా వేశారు. ఈ నెల 23న సీఎం రేవంత్రెడ్డి యాదాద్రిలో పర్యటించనుండగా, అదేరోజు అక్కడే క్యాబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. జూన్ 2వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించిన పలు కొత్త పథకాలకు ఈ సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది.
యాదగిరిగుట్ట, మే19: యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ నిధులతో కొండపైన నిత్య కల్యాణమండపం, తిరుమాఢ వీధుల్లోకి వెళ్లేందుకు మెట్లమార్గం, దీక్షాపరుల మండపం, వసతిగృహాలు, ఫ్యాబ్రిక్ షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతారని పేర్కొన్నారు. కంచికామకోటి పీఠాధిపతులు, శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి టెంపుల్ సిటీపై 15 ఎకరాల్లో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేదపాఠశాల భవన నిర్మాణానికి సీఎం భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు.