హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ తన చాంబర్లో నిర్వహించిన బీఏసీ(బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ నుంచి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ఎంఐఎం నేతలు గైర్హాజరయ్యారు.
నేడు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 17వ, 18న రెండు రోజులు బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఆ తర్వాత 19న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ నెల 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమవుతుంది. ఈ నెల 27 వరకు వివిధ పద్దులపై చర్చించిన తర్వాత అదే రోజు సభ వాయిదాపడే అవకాశమున్నది. కాగా, ఈ నెల 14న హోళీ, 16న ఆదివారం, 20వ తేదీన బడ్జెట్ తెల్లారి సభ్యుల అధ్యయనం కోసం అసెంబ్లీ వ్యవహారాలకు సెలవులు ఇవ్వాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తానికి బడ్జెట సమావేశాలు 12 రోజుల పనిదినాలుగా ఉండే అవకాశాలున్నాయి.