హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీజీ టెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సారి పేపర్-1లో 61%, పేపర్-2లో 33.98% అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 2024తో పోల్చి తే ఫలితాలు తగ్గడం గమనార్హం. 202 4లో పేపర్-1లో 67.13%, పేపర్-2లో 34.18% ఉత్తీర్ణతశాతం నమోదయ్యింది.
మరీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో
టెట్‌ను అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కాంగ్రెస్ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంలేదు. పైగా వరుసగా టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసి.. వేలకు వేలు ఫీజులు పోగేసుకుంటున్నది. కీలకమైన టీచర్‌పోస్టుల భర్తీని పూర్తిగా అటకెక్కించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేయకుండా చోద్యం చూస్తున్నది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మూడు టెట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అదే టీచర్ పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆచరిస్తుండగా, డీఎస్సీ విషయంలో ఆచరించడంలేదు. 2024 డీఎస్సీలో 10 వేలకుపైగా టీచర్పోస్టులను భర్తీచేయగా, దీంట్లో 6వేల వరకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాల్లేవు. పైగా టెట్ ఫీజులను కాంగ్రెస్ సర్కారు అమాంతంగా పెంచింది. రూ. 400గా ఉన్న ఫీజును పేపర్-1కు రూ. 750, రెండు పేపర్లకు రూ. వెయ్యికి పెంచింది. ఏటా రెండు సార్లు టెట్‌ను నిర్వహించి రూ. లక్షలు పోగేసుకుంటున్నది.
డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయండి
టెట్ ఫలితాలు విడుదల కావడంతో 10వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని, అయినా ఇంతవరకు విడుదల చేయలేదని రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.