హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కారు టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదం వచ్చిపడింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వేల సంఖ్యలో టీచర్లకు నిద్రను దూరం చేసింది. అయితే రెండేండ్లలో టెట్ పాస్‌కావాలి.. లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి. టెట్‌పై ఆగస్టు 31న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం టీచర్లంతా రెండేండ్లలోపు టెట్ పాస్‌కావాల్సిందే. కేవలం ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉంది. ఈ ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్నవాళ్లు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే.
40 వేల మందిపై ఎఫెక్ట్..
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1.07లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో పదవీ విరమణకు ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న వారు 20 వేల మంది వరకు ఉంటారు. వీరికి టెట్ అవసరం లేదు. రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్కు టెట్ తప్పనిసరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత మూడుసార్లు పోస్టులను భర్తీ చేశారు. 2012, 2017, 2024 మూడు డీఎస్సీల్లో టెట్ పాసైన వారు మాత్రమే భర్తీ అయ్యారు. వీరు 25 వేలలోపే ఉంటారు. ఇటీవల టెట్ పాసైన ఇన్‌సర్వీస్ టీచర్లు మరో 10వేల మంది వరకుంటారు. వీరందరినీ మినహాయిస్తే 40 వేల మంది వరకు టీచర్లు టెట్ లేకుండా కొనసాగుతున్నారు.
ఆ మినహాయింపు రద్దయ్యినట్లే..
విద్యాహక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం టీచర్ల రిక్రూట్మెంట్కు సీటెట్, టెట్ అర్హత తప్పనిసరి. టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. జాతీయంగా 23 ఆగస్టు 2010లో ఎన్సీటీఈ టెట్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఈ నోటిఫికేషన్‌కు ముందు రిక్రూట్ అయిన వారికి మాత్రం టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. 2014 నవంబర్ 12న పైస్థాయి పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరిచేస్తూ మరో నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఈ నోటిఫికేషన్ల దరిమిలా మన రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2010కి ముందు రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో -51ని జారీచేసింది. కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే టెట్ అవసరమని ఆయా జీవోలో స్పష్టంచేసింది. తాగాజా సుప్రీంకోర్టు టీచర్లందరూ రెండేండ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పునివ్వడంతో కలవరపడుతున్నారు.
నిజంగా పరీక్షే..
టెట్ సిలబస్.. ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే టెట్ నిజంగా పంతుళ్లకు పరీక్షే అని చెప్పవచ్చు. ప్రస్తుత తరం అభ్యర్థులు టెట్‌లో గట్టెక్కలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో టెట్ ఉత్తీర్ణతశాతం చాలా తక్కువగా ఉంటున్నది. గతంలో 19, 25, 28శాతం చొప్పున మా త్రమే ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక టెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 50శాతం (75 మార్కులు) మార్కులు సాధించాల్సి ఉండగా, ఓసీ విద్యార్థులు 90 మార్కులు తెచ్చుకోవాల్సిందే. స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయులు తమకు సంబంధంలేని గణితంలో 60 మార్కులకు టెట్ రాయాలి. ఇక సైన్స్ కంటెంట్‌లో కేవలం 24 మార్కులే ఉం డగా, దీంట్లో ఫిజిక్స్, రసాయన శాస్ర్తాలున్నా యి. సాంఘికశాస్త్రం పేపర్ రాసే వారు భాష 30 మార్కులు, ఇంగ్లిష్ 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో అత్యధికులు టెట్‌లో బోల్తాపడుతున్నారు.