హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఉన్న ఆర్టీసీ కళాభవన్ అద్దె కాంట్రాక్టును టీఎస్ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌ను సీజ్ చేసింది. ఆ సంస్థ 2016లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకున్నది. ఆ భవన్లో కల్యాణమండపం, కళాభవన్, మూడు మినీ హాళ్లకు లీజ్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ప్రకారం నెలకు రూ.25.16 లక్షలను టీఎస్ఆర్టీసీకి సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెల్లించాలి. గత కొంతకాలంగా సుచిరిండియా సంస్థ సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదు. ఒప్పందం ప్రకారం.. సక్రమంగా అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి, కళాభవన్‌ను టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ అధికారులు కళాభవన్‌ను సీజ్ చేసి, సుచిరిండియా కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.