Vice Chancellor | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ‘ప్రస్తుతం వైస్చాన్స్లర్లు వైదొలిగే లోపు కొత్త వీసీలను నియమించాలి. ఏ మాత్రం జాప్యం కావొద్దు’ ఇవి సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు. కానీ వీసీల పదవీ కాలం ముగిసినా కొత్త వీసీలను నియమించలేదు. ఆఖరుకు సీనియర్ ఐఏఎస్ల అధికారులను ఇన్చార్జి వీసీలుగా నియమించారు. ఈ నెల 15లోపు లేదా కొత్త వీసీలు నియమితులయ్యే వరకు వీరు వీసీలుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శనివారం ఈ గడువు సైతం పూర్తికానున్నది. ఈ నేపథ్యంలో కొత్త వీసీలొచ్చేనా..? అంటే దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ఇన్చార్జి వీసీల పదవీ కాలం శనివారం ముగియనుండగా ప్రభుత్వం ఏం చేస్తుందన్నది సందేహాంగా మిగిలింది. రాష్ట్రంలోని 10 వర్సిటీల వీసీల పదవీకాలం మే 21న ముగిసింది. వీసీల పదవీకాలం ముగియడానికి ముందే కొత్త వీసీలను నియమించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ఆచరణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
సెర్చ్ కమిటీ సమావేశాలెప్పుడో..
వాస్తవానికి, కొత్త వీసీల నియామకానికి ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ జారీచేసి, దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే వీసీలను ఎంపికచేసే సెర్చ్ కమిటీల ఏర్పాటులో తీవ్ర జాప్యమైంది. ఎట్టకేలకు ఎన్నికల సంఘం అనుమతితో మే 15న సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసూ ప్రభుత్వం జీవోలను జారీచేసింది. సెర్చ్కమిటీలు ఏర్పాటైన మూడు నాలుగు రోజుల్లోనే సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. కానీ నెల రోజులు దాటినా సెర్చ్ కమిటీ సమావేశాలకు ముహుర్తం కుదరడంలేదు. సెర్చ్ కమిటీల్లో సీఎస్ శాంతికుమారి ప్రభుత్వ నామినీగా ఉన్నారు. కానీ సెర్చ్ కమిటీ సమావేశాలను ఎప్పుడు నిర్వహిస్తారో ఇంత వరకు ఖరారుచేయలేదు. సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీల పదవీకాలాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.