కామారెడ్డి : స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని సావర్గావ్ గ్రామం నుంచి ఖండే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా ఆటో బోల్తాపడింది.
ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.