Bandi Sanjay | ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంతో పాటు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచేందుకు బండి సంజయ్ ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏ2 ప్రశాంత్ గతంలో హెచ్ఎంటీవీలో బ్యూరో ఇన్చార్జిగా పని చేశాడని చెప్పారు. ప్రస్తుతం జర్నలిస్ట్ కాదని, నమో టీమ్ (నేషన్ విత్ నమో టీమ్)లో పని చేస్తున్నాడన్నారు. ఏబీఎం (అసోసియేషన్ ఫర్ బిలియన్ మైన్స్) ఆర్గనైజేషన్‌లో ఇది భాగమని, దీన్ని బీజేపీ పార్టీ మానిటరింగ్ చేస్తుందన్నారు. నమో టీమ్‌లో ప్రశాంత్ వరంగల్ పార్లమెంటరీ పార్టీ పరిధిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడన్నారు. రిమోట్ ఏరియాల్లో సాధారణంగా పేపర్లు బయటకు వస్తుంటాయని.. కాపీయింగ్ కోసమే జరుగుతుందన్నారు. కానీ, పేపర్లన్నీ కమలాపూర్ నుంచే ఎందుకు లీకవుతున్నాయనే కోణంలో విచారణ జరిపినట్లు తెలిపారు.
మొదట పేపర్లు తీసుకువచ్చి గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారని, వచ్చిన వాటిని పలు గ్రూప్స్‌లో, మీడియాకు షేర్ చేస్తున్నారన్నారు. ఆ తర్వాత ముందస్తుగా మాట్లాడుకొని గేమ్‌ప్లాన్ ప్రకారం.. జరిగిందేనన్నారు. లీకేజీకి ముందురోజు బండి సంజయ్, ప్రశాంత్‌కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని, ఈటల రాజేందర్, మరెవరితోనూ మాట్లాడలేదని సీపీ తెలిపారు. దీన్ని విస్తృతంగా లీకేజీతో ఆందోళనకర పరిస్థితులు తీసుకువచ్చేందుకు గేమ్‌ప్లాన్ జరిగినట్లుగా విచారణలో తేలిందన్నారు. బండి సంజయ్ ఫోన్ డేటా లభిస్తే మరింత సమాచారం తెలిసేదన్నారు. లీకేజీ రోజున ఉదయం 11.30 గంటలకు బండి సంజయ్‌కి ప్రశాంత్ మెస్సేజ్ పంపాడని, ఆ తర్వాతనే బండి సంజయ్ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారన్నారు. ఇందులో ప్రధానంగా లీకేజీల మీదనే మాట్లాడారని, తెలంగాణలో లీకేజీల జాతర అంటూ ప్రచారం చేశారన్నారు. యాదృచ్చికంగా జరిగింది కాదని.. కావాలని చూసిందేనన్నారు.
కరీంనగర్ పోలీసులు ముందుగా బండి సంజయ్‌ని అరెస్టు చేశారని, ఆ తర్వాత శాంతిభద్రతల సమస్య ఉండడంతో బొమ్మల రామారానికి తరలించారని సీపీ తెలిపారు. అక్కడి నుంచి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేశామన్నారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం వారెంట్ లేకపోయినా అరెస్ట్ చేయవచ్చన్నారు. 41ఏ సీఆర్పీసీలో అరుణేశ్ కుమార్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కొన్ని పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పిందన్నారు. సెక్షన్ 41 ప్రకారం.. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేశారు. చట్టప్రకారం తూచా తప్పకుండా అరెస్ట్ చేశామన్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారని, ఈ మేరకు అరెస్టుకు సంబంధించి సమాచారాన్ని పార్లమెంట్ స్పీకర్‌కు పంపామని తెలిపారు. బండి సంజయ్‌పై 120బీ, 420, 447, 505, అలాగే ఐటీయాక్ట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి చర్యలు తీసుకున్నామని.. ఆ పార్టీ, ఈ పార్టీ అని ఏ తేడా చూడలేదన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా కాల్ డేటా రావాల్సి ఉందన్నారు.
మహేశ్ అనే వ్యక్తికి కౌశిక్ అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయని, కాల్ డేటా తీసుకుంటే మరింత సమాచారం దొరుకుతుందన్నారు. ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని, డేటాను రిట్రైవ్ చేసే మరింత సమాచారం దొరుకుతుందన్నారు. బండి సంజయ్ ఫోన్ లేదని చెబుతున్నారన్నారు. నిన్న మీడియా సమావేశంలో.. మీడియా ప్రతినిధులు రేపు పరీక్ష లీక్ అవుతుందా..? ప్రశాంతంగా జరుగుతుందా? అని ప్రశ్నించారని సీపీ గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల్లో ఈ రకమైన అభద్రతాభావాన్ని తీసుకువచ్చేందు ఇదంతా చేశారన్నారు. పరీక్షా విధానం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర స్పష్టంగా తెలుస్తుందన్నారు. చట్టానికి లోబడి చర్యలు తీసుకున్నామని మరోసారి స్పష్టత ఇచ్చారు. పలు కేసుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను అరెస్టు చేశామని.. వరంగల్‌లో ఎక్కువగా అరెస్టయ్యింది బీఆర్ఎస్ పార్టీ వాళ్లేనన్నారు. ఎవరినీ వేధించేందుకు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ మార్గదర్శకత్వంలోనే లీకేజీ జరిగిందని, ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి పరీక్ష రద్దు చేయడం లేదంటే.. అభద్రతాభావాన్ని పెంచే దురుద్దేశం ఈ వ్యవహారంలో స్పష్టంగా విచారణలో కనిపించిందని సీపీ వివరించారు.