తెలంగాణ జాతిపిత కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిష్కరణ! కేసీఆర్ లేకుంటే దేశపటంలో తెలంగాణ రాష్ట్రమే లేదన్నది సత్యం. ప్రగతి చోదక ప్రణాళిక రూపశిల్పి కేసీఆర్ నవవసంతాల పాలనలో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందిన రెండవ ప్రాంతంగా తెలంగాణ, భారత అతిపెద్ద సంపన్న నగరాల్లో నాలుగోదిగా భాగ్యనగరం రూపొందాయన్నది చారిత్రక వాస్తవం. అనితర సాధ్యమైన నవ తెలంగాణ ప్రగతికి ఆర్బీఐ, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రఖ్యాత ఆర్థికవేత్తల ప్రశంసలు, ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన ఆర్థిక సర్వే నివేదికలు నిదర్శనాలు. కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ పరిశ్రమలు, జాతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్‌కు పోటెత్తడం, భూముల ధరలు బంగారంతో పోటీపడటం ప్రత్యక్ష సాక్ష్యాలు. కానీ సంపదపై కార్పొరేట్ శక్తులు కన్నేసి.. కబ్జాకు దిగాయి.
శవాలెక్కడ ఉన్నా, అక్కడ వాలటం, అడ్డొచ్చిన వాటిని చంపైనా శవాలను పీక్కు తినటం రాబందుల నైజం. సంపద ఎక్కడున్నా చొరబడటం, అక్కడున్న ప్రభుత్వాలను కూల్చి, తమకు సహకరించే వాళ్లను గద్దెనెక్కించి, ఆ సంపదను దోచుకోవటం కార్పొరేట్ల నైజం. తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న బడా కార్పొరేట్ల దందా ఇది. అరబ్ దేశాల చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికన్ కార్పొరేట్లు చేసిన, చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు లిబియా అధ్యక్షుడు గొప్ప దేశభక్తుడు. తన దేశ ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించిన అపూర్వనేత. బాహుబలి పైపుల ద్వారా వందల కిలోమీటర్ల మేర ఇసుక ఎడారిలో నదినే ప్రవహింపజేసి, ప్రజలకు సాగునీటిని అందించిన అపర విధాత గడాఫీ. అమెరికన్ కార్పొరేట్లను తన దేశంలో అడుగు పెట్టనివ్వని జాతీయవాది. అయితే నేరస్థులను బహిరంగ ప్రదేశాల్లో, భయంకర శిక్షలకు గురి చేస్తుండటం ఆయన లోపం. ఆ లోపాన్నే భూతద్దంలో చూపు తూ, తమ మీడియా ద్వారా గడాఫీని ని యంతగా, రాక్షసునిగా ప్రపంచానికి చూపించి, భ్రమింపజేసి, దారుణంగా హతమార్చారు అమెరికన్ కార్పొరేట్లు. అలా తమ చమురు దోపిడీని అడ్డుకున్న పలు దేశాల నేతలను హతమార్చారు వాళ్లు.
సామ్రాజ్యవాద దేశాల బారి నుంచి తన దేశాన్ని కాపాడుకున్న రష్యాపిత, హిట్లర్ ఫాసిజం బారి నుంచి ప్రపంచాన్ని కాపాడిన రక్షకుడు, భారత్ వంటి పలు దేశాలకు చేయూతనిచ్చిన మానవీయనేత స్టాలిన్. అలాంటి గొప్పనేతను కూడా పరమ నియంతగా చిత్రించగలిగిన బడా కార్పొరేట్లకు కేసీఆర్ ఓ లెక్కనా? కొండంత ఎత్తున గల పొలాలకు వందల కిలోమీటర్ల మేర బాహుబలి మోటార్ల ద్వారా సాగునీటిని అందించిన అభినవ భగీరథుడు కేసీఆర్. ఏపీతోపాటు దేశంలోని బడా కార్పొరేట్ల కండ్లన్నీ సంపన్న భాగ్యనగరం మీద పడ్డాయి. ప్రజల కోసం సంపద సృష్టిస్తూ దాన్ని పరిరక్షించిన ప్లానింగ్ లీడర్ కేసీఆర్. ప్రోగ్రెసివ్ పార్టీ అయిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణలో తమ ఆటలు సాగవని గ్రహించారు.
నేడు మీరు కార్పొరేట్లకు తెగనమ్మిన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ మేం అధికారానికి వచ్చిన తర్వాత తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం అని ఏకంగా కార్పొరేట్ల తాబేదారు బీజేపీకే సవాల్ విసిరారు కదా కేసీఆర్. అందుకే ప్రజానేత కేసీఆర్‌ను గద్దె దించి, తెలంగాణ సంపదను తమకు కారుచౌకగా కట్టబెట్టే కార్పొరేట్ నేతలను గద్దెనెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు కార్పొరేట్లు.
ప్రజల కోసం ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా రూపొందించని నేతలు ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. వారు ఎన్నో ప్రభుత్వరంగ సంస్థల్ని అనుంగు కార్పొరేట్లకు కారుచౌకగా తెగనమ్మటం, వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రూపాయికి ఎకరా చొప్పున మోదీ, 99 పైసలకు ఎకరా చొప్పున చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెట్టటం తెలిసిందే. అందుకే కబ్జా తెలంగాణా కోసం మోదీని, చంద్రబాబును వదిలారు కార్పొరేట్లు. అయితే బీజేపీ, టీడీపీ తెలంగాణలో పుంజుకోలేవు కనుక, తమ చేతి రిమోట్ వంటి రేవంత్‌ను రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌లోకి పంపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చటం తమ మీడియా, సోషల్ మీడియా ద్వారా రేవంత్‌ను ఆకాశానికెత్తించి, ప్రజానేత కేసీఆర్‌పై బురదజల్లారు, తెలంగాణ ప్రజలను భ్రమింపజేశారు. బీజేపీ, టీడీపీ శ్రేణుల పరోక్ష మద్దతుతో కాంగ్రెస్‌ను గెలిపించి, చంద్రబాబు ద్వారా రాహుల్‌గాంధీని ఒప్పించి రేవంత్‌రెడ్డిని సీఎంగా గద్దెనెక్కించుకున్నారు. అలా ఆపరేషన్ బీఆర్ఎస్, కబ్జా తెలంగాణలో బడా కార్పొరేట్లు విజయులయ్యారు. ఇదంతా సుదీర్ఘ ప్రణాళికాబద్ధంగా జరిగిందని పరిశీలకులు అనటమే కాదు, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నాను, చంద్రబాబు కాలేజీలో చదివి, రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అని ఆ మధ్య రేవంత్‌రెడ్డే స్వయంగా చెప్పారు.
మేధావులు, కమ్యూనిస్టులతోపాటు తె లంగాణలోని సబ్బండ వర్ణాలనూ భ్రమింపజేశారు. నమ్మశక్యంగా పాలిచ్చే పాడియావును వదిలేయించి, తింటూ రంకెలేసి రచ్చజేసే గొడ్డుటావును గాటన కట్టేసుకునే లా చేయగలిగింది కార్పొరేట్ మీడియా. దాని అమేయ శక్తికి మరో ఉదాహరణ ఏం టంటే.. తెలివితేటలు, భావజాలంలో చం ద్రబాబు, శశికళ సమ ఉజ్జీలు. అయినా సరే కార్పొరేట్ మీడియా అండతో ఆపరేషన్ ఎన్టీఆర్‌తో చంద్రబాబు విజయం సాధించగా, అదే మీడియా తోడులేని శశికళ ఆపరేషన్ జయలలితలో విఫలం కావటం తెలిసిందే. దీన్ని చారిత్రక అనుభవంగా తీసుకుని, మరోసారి మీడియా మాయాజాలానికి తెలంగాణ ప్రజలు మోసపోకూడదన్నది సామాజిక శ్రేయోభిలాషుల ఆకాంక్ష.
చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు మరో పోరాట ఆవశ్యకతను గుర్తించారు. ఉదాహరణకు సోషలిస్ట్ రష్యా ఆవిర్భావం కోసం లెనిన్ నాయకత్వాన ఒక పోరాటం, అంతర్గత శత్రువుల కుట్రలను ఎదుర్కొంటూనే రష్యా ప్రగతి సాధనకు స్టాలిన్ సారథ్యంలో రెండో పోరాటం, సామ్రాజ్యవాదం, ఫాసిజం బారి నుంచి సోషలిస్ట్ రష్యా పరిరక్షణ కోసం స్టాలిన్ నాయకత్వాన్నే మూడో పోరాటం జరిగాయన్నది చారిత్రక సత్యం. అలాగే తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఆవిష్కరణ పోరాటం జరిగింది. ఓటుకు నోటు వంటి పలు కుట్రలను ఎదుర్కొంటూనే తెలంగాణ ప్రగతి సాధన కోసం ఇంటా బయటా కేసీఆర్ సారథ్యంలోనే రెండో పోరాటం జరిగింది.
రెండు పోరాటాలు విజయం సాధించాయి. ఆ తర్వాత ఏపీతోపాటు దేశంలోని బడా కార్పొరేట్లు భాగ్యనగరంపై కన్నేశారు. ‘కబ్జా తెలంగాణ’కు శ్రీకారం చుట్టారు. మరోవైపు తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, శాశ్వతంగా తమ గుప్పిట పెట్టుకొనేందుకు కార్పొరేట్లు మరో కుట్రను ప్రారంభించారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోవటానికే భయపడుతున్నారు తెలంగాణ శ్రేయోభిలాషులు.
నాడు స్త్రీ, బాల, వృద్ధులు సహా స్టాలిన్ నాయకత్వాన దేశభక్త మహాయుద్ధంలో పాల్గొని, సోషలిస్ట్ రష్యాను కాపాడుకున్నారు. అలాగే కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలంతా మరోసారి తెలంగాణ భక్త మహా పోరాటంలో పాల్గొని, భాగ్యనగరం సహా తెలంగాణను పరిరక్షించుకొందురు గాక. తన ప్రజల కోసం తెలంగాణలోని ప్రతి చుక్క నీటినీ ఒడిసిపట్టిన ప్రజానేత కేసీఆర్‌లాగే, తెలంగాణ ప్రజలు కూడా ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను ఒడిసిపట్టి, కార్పొరేట్ పార్టీల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లికి విముక్తిని కలిగించుకొందురుగాక. తథాస్తు.