ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబురాలు.. మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసుల కీచకకాండ! సోమవారం ఒకేరోజు రెండు భిన్న దృశ్యాలు కనిపించాయి. మాటలకు, చేతలకు మధ్య పొంతన లేని రేవంత్ సర్కారు తీరుకు ఇవి అద్దం పట్టాయి. ఆశా కార్యకర్తలపై మగ పోలీస్ అధికారులు కర్కశంగా వ్యవహరించారు. చీరలు లాగుతూ.. ఎడాపెడా కొడుతూ దమనకాండ సాగించారు. సోమవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలతో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారిని బలవంతంగా డీసీఎం వ్యాన్‌లోకి ఎక్కించడంతోపాటు.. ఓ మహిళ చీరను లాగుతున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్. ఫోన్లో చిత్రీకరిస్తున్న సీఐ శ్రీనివాస్, పోలీసులు
ASHA Workers | హైదరాబాద్/సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వేతనాలు పెంచాలని కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ, ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు దమనకాండ సాగించారు. చీరపట్టి లాగుతూ, ఎడాపెడా కొడుతూ, కిందపడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు. ఇన్స్పెక్టర్పై ఒక మహిళ చేయిచేసుకున్నదని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు. అయితే, ఆ ఇన్స్పెక్టరే తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు, మహిళా పోలీసులు కలిసి డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతూ దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు మహిళలపై సాగించిన దౌర్జన్యకాండను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఈ ఘటనలో పలువురు ఆశా కార్యకర్తలకు గాయాలయ్యాయి. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తమ వేతనాలను రూ.18 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోతామని ఆశా వర్కర్లు పోలీసులకు తెలియజేశారు. సుల్తాన్‌బజార్ పోలీసులు కూడా ఇందుకు ఆమోదం తెలిపారు. అనంతరం 12 గంటల ప్రాంతంలో అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లు అక్కడకు చేరుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సంఘం నాయకులు ఆకస్మాత్తుగా ధర్నాకు పిలుపు నిచ్చారు. ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
చేతులు లాగి… మీద పడి…!
సుల్తాన్‌బజార్ ఏసీపీ శంకర్ ఒక్కరే అన్ని తానై మహిళా పోలీసులున్నా, ఆశా వర్కర్లను పక్కకు నెట్టుతూ హంగామా చేశారు. ఆశా వర్కర్లను జుట్టు, చేతులు, కాళ్లు పట్టి లాగుతూ ఒక్కొక్కరిని ఎత్తుకెళ్లి డీసీఎం వ్యాన్‌లో పడేయడం ప్రారంభించారు. మహిళా పోలీసులు అక్కడున్నా, వారిని కూడా పక్కకు నెట్టేస్తూ ఏసీపీ స్వయంగా ఆశా వర్కర్లను లాక్కుంటూ తీసుకెళ్లారు. ఇలా అరగంటకుపైగా పోలీసులు ఆశా వర్కర్లపై దౌర్జన్యకాండ సాగించారు. డీసీఎంలోకి ఎక్కించిన తరువాత కూడా ఆశా వర్కర్లపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ల పట్ల పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల దాడులతో ఒక ఆశా వర్కర్ సంతోష సొమ్మసిల్లి పడిపోగా, రహిమాబీ, యాదమ్మ, మరికొందరికి గాయాలయ్యాయి. రహిమాబీ చేయికి బలమైన గాయం కావడంతో ఆమె ఉస్మానియా దవాఖానలోని ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
సీఐని కొట్టిందంటూ.. మహిళా చీర లాగుతూ..
ఆశా వర్కర్లను డీసీఎం వ్యాన్లోనికి ఎక్కించిన తరువాత పోలీసులు వెనుక డోర్‌ను మూసివేశారు. ఆ సమయంలో ఒక ఆశా వర్కర్ కాలు డోర్ మధ్య చిక్కుకున్నది. ఆ బాధతో విలవిలలాడిన ఆమె.. డోర్ వేస్తున్నవారిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారికి ఆమె చేయి తగిలింది. దీంతో అక్కడే ఉన్న ఏసీపీ, మహిళా కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది ఆమెపై విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్కు అసలు ఏమి జరుగుతున్నదో అర్థం కాలేదు, ‘సార్ మిమ్మల్ని చంప మీద కొట్టింది’ అంటూ అక్కడున్న సిబ్బంది ఆయనకు చెప్పారు. ‘అదేమీలేదు.. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటి జరుగుతుంటాయి’ అంటూ ఆయన ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. అయినప్పటికీ, ఏసీపీ శంకర్, మహిళా సిబ్బంది డీసీఎంలో ఉన్న ఆమెపైకి ఎగిరెగిరిపడుతూ ఆమెను కొట్టారు. అంతటితో ఆగకుండా తన చీరను కూడా ఏసీపీ లాగడని ఆ మహిళ ఆరోపించారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్స్పెక్టర్ను ఆమె ఉద్దేశపూర్వకంగా కొట్టినట్టు లేదని ఆయా వీడియాలను వీక్షించినవారు అభిప్రాయపడుతున్నారు. తనపై దాడి జరుగలేదని ఇన్స్పెక్టర్ సైతం చెప్తున్నా వినకుండా పోలీసు సిబ్బంది రెచ్చిపోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
దౌర్జన్యకాండలో ఏసీపీ కుట్ర?
ధర్నా చేస్తున్న వారిని నిలువరించేందుకు అక్కడ మహిళలు, పురుషులకు సంబంధించిన పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఏసీపీ ఒక్కరే హంగామా చేయడం వెనుక అంతర్యమేమిటి? అనే చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కిందిస్థాయి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే, వారిని సముదాయిస్తూ అక్కడ పరిస్థితులను ఏసీపీ, డీసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు చక్కదిద్దుతుంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఏసీపీనే పరిస్థితులు ఉద్రక్తంగా మారాడానికి కారకుడయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ మధ్య కోల్డ్వారు నడుస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. ధర్నాలు, ఆందోళనలను స్థానిక ఇన్స్పెక్టర్ అదుపు చేయలేని పరిస్థితిలో ఉన్నాడని, అందుకే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేయడం, తద్వారా సీఐని ఇక్కడి నుంచి పంపించే రహస్య ఎజెండాతో ఏసీపీ ఇదంతా చేశారనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం.
పోలీసులు క్షమాపణ చెప్పాలి
పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆశా కార్యకర్తలు మండిపడుతున్నారు. మహిళా పోలీసులు ఉన్నా పురుష పోలీసులు తమను ఈడ్చుకెళ్లారని చెప్తున్నారు. ఏసీపీ శంకర్ తమను ఇష్టం వచ్చినచోట అసభ్యంగా తాకారని, సీఐ శ్రీనివాసచారి బూతులు తిట్టారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్న తమకు ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే పోలీసులు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఆశా వర్కర్లపై పోలీసుల అమానుష దాడి ; పోలీస్ అధికారులపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
సుల్తాన్‌బజార్, డిసెంబర్ 9: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లపై అసభ్యకరంగా భౌతికదాడికి పాల్పడి, దారుణంగా కొట్టిన సుల్తాన్‌బజార్ సీఐ శ్రీనివాసాచారి, ఏసీపీ శంకర్‌పై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే నెరవర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లపై అక్కా, చెల్లెళ్లు అన్న భావన లేకుండా మహిళా పోలీసులు, పురుష పోలీసులు వారిపై చేసిన దాడులను ఆయన తీవ్రంగా ఖండి ంచారు. ఆశ వర్కర్లు తీవ్రవాదులు, దొంగలు కాదని, పోలీసులు పరిధి దాటి భౌతికదాడులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో 20380/ఎన్/2024గా కేసు నమోదైందని అన్నారు. తెలంగాణలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను ఫిర్యాదు చేసిన పిటిషన్‌పై త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉన్నదని చెప్పారు. పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా మానవ హక్కుల కమిషన్‌ను కోరినట్టు తెలిపారు.