జయశంకర్ భూపాలపల్లి : చిన్న కాళేశ్వరం(Chinna kaleshwaram,) కెనాల్ పనుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Bhupalapally) మహదేవపూర్ మండల పరిధిలోని ఎల్కేశ్వ రం గ్రామంలో చేపట్టిన చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను భూనిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. మూడు రోజులుగా గ్రామంలోని భూనిర్వాసిత రైతులు తమ భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా బుధవారం మెయిన్ కెనాల్ నిర్మాణ పనులు చేపడుతుండటంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహిం చిన రైతులు తమ భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో కమల అనే మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ లోని హాస్పిటల్కు తరలించారు. కాగా, రైతులను తమ పొలాల వద్దకు కూడా రానివ్వకుండా పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అడ్డుకుంటున్నారు. భారీగా పోలీసులను మోహరించి కెనాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
భూమినే నమ్ముకొని బతుకున్న తమకు నష్టపరిహారం ఇవ్వకుండా వందల మంది పోలీసులతో వచ్చి భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా భూములను లాక్కోవడంపై బాధిత రైతులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న ఎవరూ లెక్క చేయడం లేదని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల కోసం తమ బతకులను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.