శనివారం 06 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:55:16

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద ఉద్రిక్తత

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద ఉద్రిక్తత

  • మృతదేహాలతో బాధితుల ఆందోళన
  • క్షమాపణ చెప్పిన ఎల్జీ పాలిమర్స్‌
  • బాధితులకు అండగా ఉంటామని హామీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖపట్నం సమీపంలో గ్యాస్‌ లీకేజీకి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద శనివారం ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో మరణించిన 12 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులు కంపెనీ ఎదుట పెట్టి న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవటంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఏపీ డీజీపీ గౌతంసవాంగ్‌ను బాధితులు అడ్డుకున్నారు. కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆందోళనకారులు పరిశ్రమలోకి దూసుకెళ్లటంతో అతికష్టంమీద పోలీసులు వారిని నియంత్రించారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఏపీ మంత్రులు తెలిపారు. వదంతులు నమ్మవద్దని సూచించారు.

ఎల్జీ పాలిమర్స్‌ క్షమాపణ

దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం క్షమాపణ తెలిపింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. వెంటనే అమలు చేయగల సమర్ధ సంరక్షణ ప్యాకేజీని సిద్ధంచేస్తున్నట్టు ప్రకటించింది. విష వాయువు ప్రభావాన్ని అంచనావేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు డిమాండ్‌చేస్తున్నారు. నాయకులు ఎవరొచ్చినా పరిశ్రమలోకి వెళ్లి చూసి పోతున్నారే తప్ప గ్రామాల్లోకి రావడం లేదంటూ వెంకటాపురంవాసులు మండిపడ్డారు. 


logo