నాగర్‌ర్నూల్, జూన్ 5 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో.. ఎక్కడ అడ్డుకుంటారేమోనని రెండోరోజూ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. గురువారం పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయడం.. కొందరిని అదుపులోకి తీసుకోగా.. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని గులాబీ పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద పలువురు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు ఏకంగా మినీ వ్యాన్‌తో వచ్చారు.

ఈ క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. బలవంతంగా అరెస్టు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. 30 మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు కాకుండా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో ఉంచారు. అక్రమంగా నిర్బంధించడంపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. అలాగే తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి మండలాల్లోని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల నాయకులు వంద మందిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
తిమ్మాజిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతల నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ నాయకుడు జోగు ప్రదీప్‌తోపాటు పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకొన్న వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు మండల కేంద్రానికి చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అరగంటసేపు ఆందోళన చేశారు. పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.