వరంగల్ లీగల్, డిసెంబర్ 14: పెండ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఏడేండ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా తీర్పు వచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెరుకు సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు, వారి బంధువుల వివాహ సమయంలో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన మాటూరి సుమన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారిం ది. పెండ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. కొద్ది రోజుల తర్వాత ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆ బాలిక 2014లో హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగిన ఈ కేసులో వాదనలు పూర్తికాగా సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నేరం చేశాడని భావించి పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు.