హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని విద్యార్థులకు ఇచ్చే ఉచిత యూనిఫామ్‌లు ఈసారి ఆలస్యం కానునున్నట్టు ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇట్టే అర్థమవుతున్నది. జూన్‌కు ముందే అందాల్సిన యూనిఫామ్‌లు దసరాకు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం యూనిఫామ్‌లకు సం బంధించిన వస్త్ర సేకరణ టెండర్లు ఇంకా పూర్తికాకపోవడమే. రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాశాఖ ప్రతి ఏటా రెండు జతల ఉచిత యూనిఫామ్‌లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏటా 19.5 లక్షల మంది విద్యార్థులకు రెండు జతలు అంటే సుమారు 40 లక్షల జతలు ఇవ్వాల్సి ఉంటుంది. 2026-27 విద్యాసంవత్సరంలో ఒక్క పాఠశాల విద్యకే 1.6 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అధికారులు తే ల్చారు. తొలుత టెస్కోకు ఆర్డర్ ఇచ్చి, తర్వాత రద్దు చేసి టెండర్లకు వెళ్లారు. వస్త్రంతోపాటు గురుకుల విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్‌కు సింగిల్ టెండర్ ఆ హ్వానించారు. ఈ నెల 13వరకు టెండ ర్ల దాఖలుకు గడువు ఉన్నది. టెండర్లు ముగిసిన 45 రోజుల్లో అన్నింటినీ సమకూర్చాల్సి ఉందని నిబంధనల్లో పొందుపరిచారు. గడువులోగా వస్త్రంతోపాటు స్కూల్కిట్లోని సామగ్రిని సమకూర్చలేమని బిడ్డర్లు చేతులెత్తేసినట్టు తెలిసింది.
ఈ సారి మరింత ఆలస్యం..
యూనిఫామ్‌లు ఏటా ఆలస్యంగా అందుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలోనూ ఆలస్యంగానే అంద గా, ఈ సారి మరింత ఆలస్యం కానున్నాయి. వస్త్రం కోసం విద్యాశాఖ 2025 సెప్టెంబర్‌లోనే ఆర్డర్ ఇచ్చింది. కొంత అడ్వాన్స్ చెల్లించింది. మొదటి జత వస్త్రం గత ఏడాది ఏప్రిల్ చివరికల్లా మండలాలకు చేరింది. సెప్టెంబర్‌లో రెండో జతకు కావాల్సిన వస్త్రం అందించింది. సెప్టెంబర్‌లో ఆర్డర్ ఇస్తేనే ఈ పరిస్థితి ఉంటే, ఈ ఏప్రిల్‌లో టెండర్లు దాఖలు చేస్తే జూన్‌లోపు వస్త్రం అందుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.