హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ (Fish Distribution) పథకంలో భాగంగా రొయ్యపిల్లల సరఫరా టెండర్లలో మత్స్యశాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనర్హులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. టెండరు దాఖలు చేసేవారికి సొంత భూమిలో లేదా లీజు అగ్రిమెంటుతో రిజిస్టరైన హేచరీ ఉండాలి. కానీ, టెండర్ల గడువు ముగియడానికి 4 రోజుల ముందు కొత్తగా నోటరీ విధానాన్ని తెరపైకి తేవడం, టెండర్ల చివరి రోజు (ఈ నెల 22న) దరఖాస్తులు దాఖలడం పలు అనుమానాలు రేపుతున్నది. మార్చిన మార్గదర్శకాలను అనుకూలంగా చేసుకుని బినామీ సంస్థల పేరుతో అధికారులు ఓ దరఖాస్తు, మత్స్యశాఖలో కీలకమైన ఓ నేత మరో 2 దరఖాస్తులు దాఖలు చేసినట్టు తెలిసింది. వాటికే టెండర్లు కట్టబెట్టేందుకు వీలుగా అధికారులు ఆదివారం హుటాహుటిన సంబంధిత హేచరీల్లో తనిఖీలు పూర్తిచేసినట్టు సమాచారం. దీంతో రొయ్యపిల్లల సరఫరా టెండర్లను పూర్తిగా అనర్హులకే కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని మత్స్యసహకార సంఘాలు అనుమానిస్తున్నాయి.
రొయ్యపిల్లల సరఫరా కోసం ఈ నెల 22న ఏడు హేచరీలు టెండర్లు దాఖలు చేశాయి. కనుపూరు భక్తవత్సలరెడ్డి (నెల్లూరు), ఎంఎస్ఆర్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ (కాకినాడ), శ్రీసూర్యా హెచరీస్(కాకినాడ), వెంకట చలపతిరావు (కేరళ), గండం ఉమాగౌరీ కోమలి దేవి (జీపీ నాయుడు-భీమవరం), వేగేశ్న చైతన్య కుమార్ (తమిళనాడు), విష్ణుప్రియా ఏజెన్సీ (భీమవరం) ఈ టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో కనుపూరు భక్తవత్సలరెడ్డి పేరిట అధికారులు, వేగేశ్న చైతన్య కుమార్, విష్ణుప్రియ ఏజెన్సీల పేరిట మత్స్యశాఖలోని కీలక నాయకుడు టెండర్లు దాఖలు చేసినట్టు తెలిసింది.
మార్గదర్శకాల ప్రకారం స్కాంపీ రకం రొయ్యపిల్లలను సరఫరా చేయకూడదు. ఇవి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాలువల్లో పెరిగే నాసిరకం రొయ్యపిల్లలు. నిబంధనల ప్రకారం ‘రోజన్బర్గ్ క్యాంపీ’ రొయ్యపిల్లలను సరఫరా చేయాలి. స్కాంపీ రకానికి చెందిన ఒక్కో రొయ్యపిల్ల ధర కేవలం 10 పైసలుగా, రోజన్బర్గ్ క్యాంపీ రొయ్యపిల్ల ధర రూ.2.30గా ఉంటుందని మత్స్యసహకార సంఘాలు తెలిపాయి. స్కాంపీ రకం రొయ్యపిల్లల ఉత్పత్తికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. కానీ, ప్రస్తుతం టెండర్లు వేసిన సంస్థలు మాత్రం 3 నుంచి 6 రోజుల క్రితం రిజిస్టరైన హేచరీలను లీజు తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇంత తక్కువ సమయంలో రొయ్యపిల్లలను ఎలా ఉత్పత్తి చేయగలరని మత్స్యకారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం టెండర్లు దాఖలు చేసిన హేచరీల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంఎస్ఆర్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీసూర్య హేచరీస్, వెంకట చలపతిరావు, గండం ఉమా గౌరీ కోమలిదేవి (జీపీనాయుడు) హేచరీలకు మాత్రమే అర్హతలు ఉన్నట్టు సమాచారం. కనుపూరు భక్తవత్సలరెడ్డి, వేగేశ్న చైతన్య కుమార్, విష్ణుప్రియ ఏజెన్సీలకు ఎలాంటి అర్హతలు, అనుమతులు లేవని తెలిసింది. అయినప్పటికీ దొడ్డిదారిన టెండర్లను దక్కించుకునేందుకు ఈ హేచరీలు అర్హత కల్గిన హేచరీల నుంచి శాంపిల్‌గా కొన్ని రొయ్యపిల్లలను తెచ్చి తనిఖీల సందర్భంగా అధికారులకు చూపించేందుకు సిద్ధమైనట్టు వినికిడి.