హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం కోటి మందికిపైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నది. ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవమున్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపుహౌజ్‌లు, పైపులైన్లు, నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను కేవలం ‘ఒకరి’ చేతుల్లోనే పెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన జలమండలి అధికారులు.. ఒక్క ఫోన్‌కాల్‌తో రివర్స్ గేర్ వేశారు. విడివిడిగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అందుకు భిన్నంగా అన్నింటికి కలిపి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు.
ప్రస్తు తం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనకు అనుమతి రాగానే అన్ని వ్యవస్థల నిర్వహణ బాధ్యతను ‘ఆ ఒక్కరికే’ అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. జలమండలిలో అనేక టెండర్ల వెనుక కూడా ‘ముఖ్య’నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.గ్రేటర్ ప్రజలకు కృష్ణా, గోదావరి నదీజలాలే ప్రాణాధారం. హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న తాగునీటిలో దాదా పు 80% ఈ 2 వనరుల నుంచే వస్తున్నది. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి రోజుకు 275 మిలియన్ గ్యాలన్ల కృష్ణా నీరు, ఎల్లంపల్లి నుంచి రోజుకు 168 మిలియన్ గ్యాలన్ల గోదావరి నీరు సరఫరా అవుతున్నది.
కృష్ణా నీటి తరలింపునకు కోదండాపూర్ నసర్లపల్లి, గొడకొండ్ల, గునగల్, సాహెబ్‌నగర్‌లో.. గోదావరి నీటి తరలింపునకు బొమ్మకల్, మల్లారం, కొండపాక, ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన పంపుహౌజ్‌లు, తాగునీటి శుద్ధి కేంద్రాలు, శుద్ధిచేసిన నీటి ప్లాంట్ల నిర్వహణ కోసం దశాబ్దాల నుంచి ఏటా విడివిడిగా టెండర్లు పిలుస్తున్నారు. ఈ వ్యవస్థల నిర్వహణకు జలమండలి ఏటా రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈసారి కూడా రూ.70 కోట్ల విలువైన మూడు వేర్వేరు వ్యవస్థలకు టెండర్లు పిలిచేందుకు జలమండలి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆ వెంటనే ‘ముఖ్య’నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం, టెండర్లను వేర్వేరుగా కాకుండా అన్నింటినీ కలిపి రెండు సంవత్సరాల ప్రాతిపదికన రూ.140 కోట్లకు టెండర్లు పిలవాలని ఆ వ్యక్తి ఆదేశించడంతో పరిస్థితి మారిపోయింది. రెండేండ్లపాటు పంపుహౌజ్‌లు, నీటిశుద్ధి కేంద్రాలు, పైపులైన నిర్వహణకు ఒకే టెండర్లు పిలిచేలా అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఇదంతా ఒక కాంట్రాక్టర్ కోసమే చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఓ పెద్ద కంపెనీ పేరిట పలు పనులను దక్కించుకున్న ఆ కాంట్రాక్టర్.. ఇప్పుడు మూడు వ్యవస్థ నిర్వహణ పనులను కూడా అదే బడా కంపెనీ పేరిట దక్కించుకునేందుకు ‘ముఖ్య’నేత సన్నిహితుడిని ఆశ్రయించడం వల్లనే జలమండలి అధికారులు రివర్స్ గేర్ వేసినట్టు సమాచారం.
తాగునీటి సరఫరాలో భాగమైన నీటిశుద్ధి, పంపింగ్, పైప్లైన్ల నిర్వహణ బాధ్యతలను ఆయా రంగాల్లో నైపుణ్యమున్న వేర్వేరు కంపెనీలకు కాకుండా ఒకే కంపెనీకి కట్టబెట్టడం సరికాదని, ఇది ఇంజినీరింగ్ ప్రమాణాలకే విరుద్ధమని నిపుణులు అంటున్నారు. దశాబ్దాల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న విధానాన్ని పక్కనపెట్టి కొత్త విధానాన్ని అమలు చేయడం, అన్ని బాధ్యతలను ఒకే కంపెనీకి అప్పగించడమంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.