హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడితేనే తాను స్పందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని, దీనిపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌పై మంత్రి స్పందించారు. ‘చర్చకు పెట్టాలంటే చాలా ఉన్నాయి.. నేను ఎప్పుడూ హరీశ్‌రావుకు రియాక్ట్ కాను. అప్పుడప్పుడు మా సీఎం మాట్లాడుతారు. హరీశ్‌రావు, కేటీఆర్ గురించి నేను మాట్లాడను. కేసీఆర్ మాట్లాడితే మాత్రం మాట్లాడుతా’ అని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరిగానే, తాను పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, తనదేం నామినేటెడ్ పదవి కాదంటూ వ్యాఖ్యానించారు.
‘కేసీఆర్ ఉద్యమకారుడు, పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకుంటాం.. సూచనలు ఇస్తే స్వీకరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి మేలు చేస్తుందని గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా, సమాధానం దాటవేశారు. నదీ జలాల అంశంపై ఇప్పటికే అనేకసార్లు అసెంబ్లీలో చర్చించినట్టు, ప్రతిపక్ష నాయకుడు వస్తే మళ్లీ చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. హరీశ్‌రావు కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా వస్తే అసెంబ్లీని ఏర్పాటు చేయించి చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. ఊళ్లలో పేదలు సన్నబియ్యం తింటూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై స్పందిస్తూ ‘కూలి నాలి చేసేవాళ్లకు రూ. 5లక్ష ల ఇల్లంటే మామూలు విషయం కాదు.. రూ. 5లక్షలు కాదుకదా.. రూ.ఐదు వేలు చూస్తారా వాళ్లు..’అని పేర్కొన్నారు.